‘వివాద్ సే విశ్వాస్’ స్కీమ్ గడువు పొడిగింపు

  • 2025 జనవరి 15 వరకు అవకాశం కల్పించిన ఆదాయ పన్ను విభాగం
  • 10 శాతం జరిమానాతో తక్కువ స్థాయి పన్ను వివాదాల పరిష్కారానికి అవకాశం
  • ప్రత్యేక పథకాన్ని 2024 బడ్జెట్‌లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
తక్కువ స్థాయి పన్ను వివాదాలను సులభంగా పరిష్కరించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వివాద్ సే విశ్వాస్’ స్కీమ్ గడువును ఆదాయ పన్ను విభాగం పొడిగించింది. నిజానికి ఇవాళ్టితో (2024 డిసెంబర్ 31) ఈ స్కీమ్ డెడ్‌లైన్ ముగియాల్సి ఉంది. అయితే, మరో 15 రోజులపాటు చెల్లింపుదార్లకు అవకాశం కల్పించింది. 2025 జనవరి 15 వరకు గడువును పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. 
 
తక్కువ స్థాయి పన్ను వివాదాల పరిష్కారం కోసం ఈ పథకాన్ని కేంద్ర బడ్జెట్ 2024లో ప్రభుత్వం ప్రకటించింది. వివాదాస్పద పన్నులో 10 శాతం చెల్లించి సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలు కల్పించింది. గడువు తేదీ దాటిన తర్వాత, జనవరి 31 వరకు వివాదాస్పద పన్నులో 100 శాతం, లేదా, 25 శాతం ఆలస్య జరిమానా/వడ్డీ చెల్లించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి పన్నులో 110 శాతం లేదా వడ్డీలో 30 శాతం చెల్లించి వివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.


More Telugu News