జీవాంజి దీప్తిని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

  • పారాలింపిక్స్‌లో కాంస్య పతక విజేత దీప్తికి గోపీచంద్ బాడ్మింటన్ అకాడమి ఆధ్వర్యంలో సన్మానం
  • దీప్తి ప్రతిభకు తగిన గుర్తింపు లభించిందన్న మెగాస్టార్ చిరంజీవి
  • 400 మీటర్ల పరుగు టీ 20 విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న దీప్తి
పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ 20 విభాగంలో జీవాంజీ దీప్తి ప్రతిభను చాటి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో గోపీచంద్ బాడ్మింటన్ అకాడమి ఆధ్వర్యంలో సోమవారం దీప్తికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి దీప్తిని అభినందించారు. దీప్తి ప్రతిభకు తగిన గుర్తింపు లభించిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు.  
 
వరంగల్ జిల్లా పర్యతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన యాదగిరి, లక్ష్మి దంపతుల కుమార్తె జీవాంజీ దీప్తి. వీరిది నిరుపేద కుటుంబం. చిన్నతనంలో దీప్తి మానసిక వైకల్యం, మేథోపరమైన బలహీనతలు ఉన్నప్పటికీ ఆమెకు క్రీడల పట్ల వున్న మక్కువను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఒక దశలో దీప్తి తండ్రి యాదగిరి తనకు ఉన్న ఎకరం పొలాన్ని కూడా విక్రయించి కుమార్తెను ప్రోత్సహించాడు. దీంతో దీప్తి తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగింది. పారాలింపిక్స్‌లో ఏకంగా కాంస్య పతకాన్ని సాధించి పుట్టిన గడ్డకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. 


More Telugu News