శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగం సక్సెస్

  • నేటి రాత్రి 10 గంటల 15 సెకన్లకు నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్
  • టార్గెట్, ఛేజర్ అనే ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-60
  • డాకింగ్, అన్ డాకింగ్ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా తాజా ప్రయోగం
  • ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సంబరాలు
శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగం సక్సెస్ అయింది. స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్ (స్పేడెక్స్) లో భాగంగా టార్గెట్, ఛేజర్ అనే జంట ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ రెండు శాటిలైట్ల బరువు 440 కిలోలు. 

ఈ రాత్రి 10 గంటల 15 సెకన్లకు కౌంట్ డౌన్ ముగియగా, రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటి తర్వాత ఎలాంటి లోపాలకు తావులేని రీతిలో టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను  నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ ల డాకింగ్, అన్ డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం ఈ రాకెట్ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. 

సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్న భారత్ కు ఈ డాకింగ్, అన్ డాకింగ్ టెక్నాలజీ ఎంతో కీలకం. ఇప్పటివరకు ఈ టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఇక, పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో, ఇస్రో వర్గాలు సంబరాలు చేసుకున్నాయి.


More Telugu News