గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

  • ఈరోజు మంగ‌ళిగిరిలో మీడియాతో మాట్లాడిన జ‌న‌సేనాని 
  • బ‌న్నీ విష‌యంలో తెర ముందు, వెనుక ఏం జ‌రిగిందో త‌న‌కు తెలియ‌ద‌న్న ప‌వ‌న్‌
  • అల్లు అర్జున్ త‌ర‌ఫున బాధిత కుటుంబం వ‌ద్ద‌కు ముందే వెళ్లి ఉండాల్సింద‌ని వ్యాఖ్య‌
  • ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌లేన‌న్న డిప్యూటీ సీఎం
ఈ నెల 4న 'పుష్ప‌2' ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న, న‌టుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఈరోజు మంగ‌ళిగిరిలో జ‌న‌సేనాని మీడియాతో చిట్‌చాట్‌లో ఆయ‌న‌ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారని ప‌వ‌న్ పేర్కొన్నారు.  

"బ‌న్నీ విష‌యంలో తెర ముందు, వెనుక ఏం జ‌రిగిందో నాకు తెలియ‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌ను. చ‌ట్టం అంద‌రికీ స‌మానమే. పోలీసులు త‌ప్ప‌కుండా భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తారు. థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయ‌న కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయ‌న‌కు ఆ అరుపుల్లో స‌రిగా వినిపించ‌క‌పోవ‌చ్చు. 

అల్లు అర్జున్ త‌ర‌ఫున బాధిత కుటుంబం వ‌ద్ద‌కు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గ‌తంలో ఫ్యాన్స్‌తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాలు చూసేవారు. కానీ, ఆయ‌న ముసుగు వేసుకుని ఒక్క‌రే థియేట‌ర్‌కు వెళ్లేవారు. 

ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి వ‌చ్చిన గొప్ప నాయ‌కుడు. వైసీపీ విధానాల త‌ర‌హాలో అక్క‌డ ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌లేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు అవ‌కాశం ఇచ్చారు" అని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పుకొచ్చారు.  


More Telugu News