యశస్వి జైస్వాల్ నయా హిస్టరీ.. దిగ్గజాల సరసన చేరిన యువ సంచలనం

  • టెస్ట్ ఫార్మాట్‌లో ఈ ఏడాది మొత్తం 1,478 పరుగులు సాధించిన యువ ఆటగాడు
  • ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక టెస్ట్ పరుగులు సాధించిన మూడవ భారతీయ ఆటగాడిగా నిలిచిన జైస్వాల్
  • మెల్‌బోర్న్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 84 రన్స్‌తో రాణించిన యువ బ్యాటర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ వేదికగా జరిగిన నాలుగో టె‌స్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో అత్యధికంగా 84 పరుగులు సాధించిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఖాతాలో ఒక రికార్డు చేసింది.

2024లో టెస్ట్ ఫార్మాట్‌లో యశస్వి జైస్వాల్ సాధించిన పరుగులు 1,400 దాటాయి. ఈ ఏడాది అతడు మొత్తం 1,478 రన్స్ బాదాడు. దీంతో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు సాధించిన మూడవ భారతీయ బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. అతడి కంటే ముందు 2010లో సచిన్ టెండూల్కర్ 1,562 పరుగులు, 1979లో సునీల్ గవాస్కర్ 1,555 రన్స్ సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక నాలుగవ స్థానంలో వీరేందర్ సెహ్వాగ్ నిలిచాడు. 2008లో సెహ్వాగ్ 1,462 పరుగులు బాదాడు.

కాగా, మెల్‌బోర్న్ టెస్టులో జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. సీనియర్ బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 82, రెండవ ఇన్నింగ్స్‌లో 84 పరుగులు సాధించాడు.


More Telugu News