కొరియా విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ వ్యక్తి స్పృహ వచ్చాక ఏం చెప్పాడంటే..!

  • ఏం జరిగింది..? నేను ఆసుపత్రిలో ఎందుకున్నా?.. అంటూ ప్రశ్నించిన బాధితుడు
  • ప్రమాదం కారణంగా షాక్ కు గురయ్యాడని చెబుతున్న అధికారులు
  • మరో బాధితురాలికీ ఏమీ గుర్తులేదని వెల్లడించిన వైద్యులు
దక్షిణ కొరియాలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. విమానం పేలిపోయి అందులోని 179 మంది చనిపోగా.. ఇద్దరు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. విమానానికి మంటలు అంటుకోవడంతో వేగంగా స్పందించిన రెస్క్యూ టీం.. ప్రాణాలతో ఉన్న ఈ ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆపై అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామని, ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

ప్రమాద సమయంలో స్పృహ తప్పిన ఫ్లైట్ అటెండెంట్ సాయంకాలం కళ్లు తెరిచాడని చెప్పారు. దీంతో అతడి ద్వారా ఈ ఘోర ప్రమాదానికి కారణం తెలుసుకుందామని ప్రయత్నించిన పోలీసులకు నిరాశ తప్పలేదు. వివరాలు చెబుతాడని ఆశించిన బాధితుడు తిరిగి తమనే ఎదురు ప్రశ్నించాడని, అసలు ఏం జరిగిందని, విమానంలో ఉన్న తాను ఆసుపత్రిలోకి ఎప్పుడు వచ్చానని అడిగాడని పోలీసులు తెలిపారు. బాధితుడు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని డాక్టర్లు చెప్పారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు బాధితుడిని సియోల్ లోని మరో ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

మరో బాధితురాలికి తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. దీంతో ఆమెతో మాట్లాడేందుకు వీలు లేకుండా పోయిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బాధితులలో ఎవరైనా కోలుకుంటే తప్ప విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే వివరాలు తెలిసే అవకాశం లేదని వివరించారు. కాగా, దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్ పోర్టులో ఆదివారం ఉదయం జెజు ఎయిర్ సంస్థకు చెందిన విమానం క్రాష్ ల్యాండింగ్ కావడంతో 179 మంది చనిపోయిన విషయం తెలిసిందే.


More Telugu News