అమెరికా మాజీ ప్రెసిడెంట్ కు హర్యానా గ్రామంతో లింక్.. ఏకంగా ఊరి పేరునే మార్చుకున్న గ్రామస్థులు

  • 100వ ఏట జిమ్మీ కార్టర్ మృతి 
  • భారత పర్యటనలో హర్యానాలోని ఓ గ్రామాన్ని సందర్శించిన కార్టర్
  • ఆయన గౌరవార్థం విలేజ్ పేరును కార్టర్ పురిగా మార్చుకున్న గ్రామస్థులు
అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ వందేళ్ల వయసులో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్టర్.. కుటుంబ సభ్యుల మధ్య తుదిశ్వాస వదిలారని ఆయన ఫ్యామిలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కార్టర్ ఇక లేరనే వార్త తెలిసి భారతదేశంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ప్రజలు విచారం వ్యక్తం చేశారు. కార్టర్ లేకపోయినా ఆయన పేరు మాత్రం కలకాలం ఉంటుందని చెప్పారు. కార్టర్ పేరునే తమ గ్రామానికి పెట్టుకున్నట్లు వివరించారు. అదే హర్యానాలోని కార్టర్ పురి గ్రామం.. భారత్ లో పర్యటించినపుడు జిమ్మీ కార్టర్ ఈ గ్రామాన్ని సందర్శించారు.

1960 లలో జిమ్మీ కార్టర్ తల్లి, సామాజిక కార్యకర్త అయిన లిలియాన్ గార్డీ కార్టర్ హర్యానాలోని దౌలతాపూర్ గ్రామంలో కొంతకాలం పాటు నివసించి పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. 1978 లో అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ భారత్ లో పర్యటించారు. ఆ సమయంలో తన తల్లి సేవచేసిన గ్రామాన్ని సందర్శించాలని భావించడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. దౌలతాపూర్ ను సందర్శించిన కార్టర్.. అక్కడి ప్రజలతో మాట్లాడి గ్రామ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లిలియాన్ కార్టర్ కుమారుడు అమెరికా అధ్యక్ష హోదాలో తమ గ్రామానికి రావడంపై దౌలతాపూర్ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి దక్కిన గౌరవంగా భావించారు. ఈ నేపథ్యంలోనే గ్రామం పేరును మార్చుకున్నారు. జిమ్మీ కార్టర్ పేరుతో ‘కార్టర్ పురి’ గా నామకరణం చేసుకున్నారు.


More Telugu News