లైంగిక వేధింపుల వివాదం తర్వాత తొలిసారి సందేశ్‌ఖాలీకి మమతా బెనర్జీ

  • సందేశ్‌ఖాలీలోని టీఎంసీ నేత షాజహాన్‌పై భూ ఆక్రమణలు, అత్యాచార ఆరోపణలు
  • రేషన్ కుంభకోణంలోనూ ఆయనపై ఆరోపణలు 
  • దాడులకు వెళ్లిన ఈడీ అధికారులపై సందేశ్‌ఖాలీలో దాడి
  • నేడు సందేశ్‌ఖాలీలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందించనున్న మమత
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో స్థానిక మహిళలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నేతలు అత్యాచారానికి తెగబడడంతోపాటు భూములను కబ్జా చేసినట్టు ఈ ఏడాది మొదట్లో ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారి నేడు సందేశ్‌ఖాలీలో పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

తన పర్యటనపై మమత గత వారం మాట్లాడుతూ సందేశ్‌ఖాలీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పంపిణీ చేయడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించబోతున్నట్టు చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 20 వేల మంది ప్రయోజనం పొందబోతున్నట్టు చెప్పారు. స్టేజిపై తాను 100 మందికి వివిధ పథకాలకు సంబంధించి సర్టిఫికెట్లను ఇవ్వబోతున్నట్టు చెప్పారు.  

కాగా, రేషన్ పంపిణీకి సంబంధించి కోట్ల రూపాయల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంటిపై దాడికి వెళ్లిన ఈడీ అధికారులపై ఈ ఏడాది జనవరిలో దాడి జరిగింది. వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత సందేశ్‌ఖాలీకి చెందిన పలువురు మహిళలు షాజహాన్, ఆయన అనుచరులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ భూములను ఆక్రమించుకోవడంతోపాటు తమపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇది రాజకీయంగానూ దుమారం రేపింది.

షాజహాన్‌ను అరెస్ట్ చేయాలంటూ బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి. 55 రోజుల తర్వాత షాజహాన్ అరెస్టయ్యారు. అనంతరం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా, ఈ ఘటన వెనక బీజేపీ కుట్ర ఉందని అప్పట్లో మమత ఆరోపించారు. ఈ ఘటన తర్వాత మమత తొలిసారి నేడు సందేశ్‌ఖాలీని సందర్శించనున్నారు.


More Telugu News