విందు ఆలస్యం.. పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న వరుడు.. ఆ తర్వాత ఎవరిని పెళ్లాడాడంటే..!

  • ఉత్తరప్రదేశ్‌లోని చౌందౌలీలో ఘటన
  • విందు ఆలస్యం కావడంతో గేలి చేసిన పెళ్లి కొడుకు స్నేహితులు
  • అవమానానికి గురై వధువు కుటుంబ సభ్యులతో గొడవ.. ఆపై చేయి చేసుకున్న వైనం
  • మండపం నుంచి వెళ్లిపోయి మరో యువతిని పెళ్లాడిన వరుడు
  • పోలీసులను ఆశ్రయించిన వధువు 
పెళ్లిలో విందు వడ్డించడంలో ఆలస్యమైందన్న కారణంతో వివాహాన్ని రద్దు చేసుకున్నాడో వరుడు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జరిగిందీ ఘటన. పెళ్లి కూతురు, ఆమె కుటుంబాన్ని మండపంలోనే వదిలేసిన వరుడు.. అదే రోజు కజిన్ మెడలో తాళి కట్టాడు. దీంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పెళ్లికి ముందే వరుడి కుటుంబానికి రూ. 1.5 లక్షలు ఇచ్చామని తెలిపారు. 

 మెహతాబ్‌తో బాధిత యువతికి ఏడు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. ఈ నెల 22న పెళ్లి ఊరేగింపు వధువు స్వగ్రామమైన హమీద్‌పూర్ గ్రామానికి చేరుకుంది. తాను అప్పటికే రెడీగా ఉన్నానని, పెళ్లి కొడుకు, ఆమె కుటుంబ సభ్యులు విందు ఆరగించిన తర్వాత తన తల్లిదండ్రులను దుర్భాషలాడటమే కాకుండా కొట్టి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారని బాధిత వధువు ఆరోపించింది. 

పెళ్లికొచ్చిన వారు విందు ఆరగించేందుకు కూర్చున్నారని, మెహతాబ్‌కు వడ్డించడంలో కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని వధువు అంగీకరించింది. ఈ విషయంలో అతడి స్నేహితులు హేళన చేయడంతో అవమానానికి గురైన మెహతాబ్ వధువు కుటుంబంతో గొడవకు దిగాడు. అది మరింత ముదరడంతో చేయి కూడా చేసుకున్నాడు. గ్రామస్థులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. వధువును పెళ్లాడేందుకు నిరాకరించిన మెహతాబ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. వధువు కుటుంబ సభ్యులు షాక్‌లో ఉండగానే అదే రోజు మెహతాబ్ తన కజిన్‌ను వివాహం చేసుకున్నాడు. 
 
పెళ్లి రద్దు చేసుకున్న మెహతాబ్, ఆయన కుటుంబంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ వధువు కుటుంబం తాజాగా ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకుంది. పెళ్లి రద్దు కావడంతో తాము రూ. 7 లక్షలు నష్టపోయినట్టు వివరించారు. అలాగే, వరుడి కుటుంబానికి రూ. 1.5 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. కాగా, వరుడి కుటుంబం రూ. 1.61 లక్షలు తిరిగి చెల్లించేందుకు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News