ప్రో కబడ్డీ సీజన్ 11.. తొలిసారి చాంపియన్‌గా అవతరించిన హర్యానా స్టీలర్స్

  • ఫైనల్‌లో 32-23తో పాట్నాను మట్టికరిపించిన హర్యానా స్టీలర్స్
  • బ్రేక్ తర్వాత దూకుడు పెంచిన హర్యానా
  • నాలుగోసారి విజేతగా నిలవాలన్న పాట్నా ఆశలు వమ్ము చేసిన శివమ్, రెజా, వినయ్
ప్రో కబడ్డీ లీగ్‌ 11వ సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్ అవతరించింది. పాట్నా పైరేట్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించిన హర్యానా తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. గత సీజన్‌లో రన్నరప్‌గా సరిపెట్టుకున్న హర్యానా ఈసారి తొలి నుంచీ కసిగా ఆడింది. స్థిరంగా రాణిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చింది. నిన్న జరిగిన ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించి పాట్నా పైరేట్స్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచింది.

ఒక దశలో హర్యానా, పాట్నా చెరో 7-7 పాయింట్లతో సమానంగా నిలిచినప్పటికీ ఆ తర్వాత హర్యానా ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. శివమ్, రెజా, వినయ్ అదరగొట్టారు. ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో పాయింట్ల పట్టికలో ముందంజలో నిలిచింది. విరామ సమయానికి 15-12తో ఆధిక్యం సంపాదించింది. 

బ్రేక్ తర్వాత పాట్నా పుంజుకున్నా హర్యానా మాత్రం పట్టు వదల్లేదు. శివమ్ 9, రెజా 7, వినయ్ 6 పాయింట్లు సాధించడంతో చివరికి 32-23తో చాంపియన్‌గా నిలిచింది. నాలుగోసారి కప్పు కొట్టేందుకు పాట్నా చివరి వరకు ప్రయత్నించినప్పటికీ హర్యానా ఆటగాళ్ల దూకుడు ముందు నిలవలేక రన్నరప్‌గా సరిపెట్టుకుంది. 


More Telugu News