కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏడాదిలో సాధించిన అద్బుత విజయం ఇది: మంత్రి కోమటిరెడ్డి

  • ఆర్ఆర్ఆర్ పనులు ఐదు ప్యాకేజీల్లో చేపట్టాలని నిర్ణయించి టెండర్లు ఆహ్వానించిన ఎన్‌హెచ్ఏఐ
  • సీఎం చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఆర్ఆర్ఆర్ టెండర్లు అని పేర్కొన్న మంత్రి కోమటిరెడ్డి
  • తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజని వ్యాఖ్య
హైదరాబాద్ ప్రాంతీయ వలయ రహదారి (రీజినల్ రింగ్ రోడ్డు – ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం పనులకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. గ్రీన్ ఫీల్డ్ రీజినల్ ఎక్స్ ప్రెస్ వేగా వ్యవహరించే ఈ రహదారిని నాలుగు వరుసలుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) నిర్మించనున్న నేపథ్యంలో ఈ పనులు ఐదు ప్యాకేజీల్లో చేపట్టాలని నిర్ణయించి తాజాగా టెండర్లను ఆహ్వానించింది. దీనిపై తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం ఇది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఆర్ఆర్ఆర్ టెండర్లు అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు అని తెలిపారు. ఆర్ఆర్ఆర్ తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు. ఆర్ఆర్ఆర్ పనులకు సంబంధించి టెండర్లు ఈ నెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 11.30 గంటల వరకూ స్వీకరిస్తారు. 14వ తేదీ ఎన్‌హెచ్ఏఐ టెండర్లు తెరవనుంది.
 
ఆర్ఆర్ఆర్ కోసం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అనేక సార్లు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతులు సమర్పించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 2017లోనే రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించినా .. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. 2023 డిసెంబర్‌లో పదవి చేపట్టిన నాటి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు కోసం నిరంతరం కృషి చేశానని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డితో కలిసి భూసేకరణపై అనేక సార్లు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించామని మంత్రి చెప్పారు. ఓఆర్ఆర్ గేమ్ ఛేంజర్ అయితే.. ఆర్ఆర్ఆర్ సూపర్ గేమ్ ఛేంజర్ కానున్నదని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిలో ఆర్ఆర్ఆర్ కీలక భూమిక పోషించబోతుందని పేర్కొన్నారు.


More Telugu News