పేర్ని నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్‌

  • కేసు విషయంలో ఎలాంటి రాజకీయ కక్ష లేదని వెల్లడి
  • కుట్రలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని స్పష్టత
  • తప్పు చేయనప్పుడు పెనాల్టీ ఎందుకు కట్టారని ప్రశ్నించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తమ గోడౌన్‌లో బియ్యం బస్తాలు తగ్గాయని చెపితే నగదు చెల్లించామని, అయినా కక్ష కట్టి తమపై కేసులు పెట్టారంటూ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్నినాని చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెంద్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. తప్పు చేయనప్పుడు జరిమానా ఎందుకు చెల్లించారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. భార్య పేరుతో ఎందుకు లీజు తీసుకున్నారని, గిడ్డంగి ఎవరి పేరు మీద ఉంటే వారిమీదే కేసులు నమోదవుతాయని ఆయన స్పష్టం చేశారు.

గోడౌన్‌లో రేషన్‌ బియ్యం తగ్గుదలను గుర్తించి పెనాల్టీ చెల్లిస్తామంటూ ముందుగానే లేఖ రాసింది ఎవరో చెప్పాలంటూ ప్రశ్నించారు. కుట్రలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని, తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.  వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాల్సిన అవసరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు లేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని గిడ్డంగుల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలంటూ నవంబరు 26న అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, ఆ మరుసటి రోజే జయసుధ తప్పు అంగీకరిస్తూ లేఖ రాశారని మంత్రి వివరించారు. 378 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాయమవ్వడంతో రూ.1.70 కోట్లు చెల్లించారని ప్రస్తావించారు. గత ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వం అరాచకాలు సృష్టించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వ్యవస్థలను దుర్వినియోగం చేసి స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని విమర్శించారు.

బియ్యం మాయంపై నోటీసులు అందజేస్తే పేర్ని నాని స్పందించలేదని, 378 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎక్కడకు వెళ్లాయో తేలాలి కదా అని మంత్రి నాదెండ్ల అన్నారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడారు. వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయిన 21 మంది జనసేన కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా పాల్గొన్నారు.


More Telugu News