బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం

  • తమ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ... కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుంటుందని విమర్శ
  • ప్రజలకు అందిస్తున్న పథకాలను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపాటు
  • తయ పార్టీ ఇచ్చిన హామీలతో బీజేపీ భయపడుతోందని విమర్శ
ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ... కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఎల్‌జీ సెక్రటరియేట్ తాజాగా విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమను అడ్డుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము మరోసారి గెలిస్తే మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు ప్రతి నెల రూ.2,100 ఆర్థిక సాయం, సీనియర్ సిటిజన్లకు అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించామని గుర్తు చేశారు. ఇందుకోసం ఇప్పటికే చాలామంది నమోదు చేసుకుంటున్నారని తెలిపారు.

తమ హామీలతో బీజేపీ భయపడుతోందని విమర్శించారు. ఈ పథకాలకు నమోదు ప్రక్రియకు అంతరాయం కలిగించడానికి గూండాలను కూడా పంపించారని ఆరోపించారు. బీజేపీకి మహిళలు, వృద్ధుల సంక్షేమం అవసరం లేనట్లుగా ఉందని ధ్వజమెత్తారు.

ఏం జరిగింది?

సంక్షేమ పథకాల విషయంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత, ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థి సందీప్ దీక్షిత్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాఫ్తు చేయాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఎల్జీ సెక్రటేరియట్ లేఖ రాసింది. కాంగ్రెస్ లేఖ రాస్తే, గవర్నర్ విచారణకు అనుమతించడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు.


More Telugu News