తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆర్ కృష్ణయ్య కీలక సూచన

  • పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు చొరవ తీసుకోవాలన్న కృష్ణయ్య
  • కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వినతి
  • ఏపీ సీఎం చంద్రబాబు బీసీల దీర్ఘకాలిక డిమాండ్‌ల పరిష్కారానికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి  
తెలుగు రాష్ట్రాల సీఎంలకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల డిమాండ్‌లపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో శుక్రవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బీసీల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. 

బీసీల డిమాండ్ల సాధనకు జనవరి చివరి వారంలో ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన అమరావతి వేదికగా బీసీల మహాసభ నిర్వహించనున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఇన్‌ఛార్జి నూకానమ్మ తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకట కోటేశ్వరరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితర నేతలు పాల్గొన్నారు. 


More Telugu News