భారత మాజీ ప్రధాని మృతిపై పాకిస్థాన్ గ్రామస్థుల సంతాపం.. కారణం ఇదే..!

  • సంతాప సభ ఏర్పాటు చేసి భారత మాజీ ప్రధానికి నివాళులు
  • అంత్యక్రియలకు హాజరవ్వాలని ఉన్నా కుదరక గ్రామంలోనే సంతాపం
  • ఇస్లామాబాద్ కు 100 కి.మీ. దూరంలోని గాహ్ గ్రామంలో మన్మోహన్ జననం
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై పాకిస్థాన్ లోని గాహ్ గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయని, ప్రతీ ఒక్కరూ తమ కుటుంబ సభ్యుడే చనిపోయినట్లు బాధపడుతున్నారని స్థానిక టీచర్ ఒకరు వెల్లడించారు. తామందరికీ మన్మోహన్ అంత్యక్రియలకు హాజరవ్వాలని ఉందన్నారు. అయితే, అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో గ్రామంలోనే సంతాప సభ ఏర్పాటు చేసి మన్మోహన్ కు నివాళులు అర్పించినట్లు వివరించారు. మన్మోహన్ సింగ్ తమ గ్రామంలోనే పుట్టారని, దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం వలస వెళ్లిందని చెప్పారు. మన్మోహన్ సింగ్ ను తాము ఎన్నోసార్లు తమ గ్రామానికి ఆహ్వానించామని, కానీ ఆయన రానేలేదని తెలిపారు. ఆయన భార్యా పిల్లలైనా ఒక్కాసారి తమ గ్రామానికి వస్తారని ఆశిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాహ్ గ్రామంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. దేశ విభజనకు ముందు భారత్ లో ఉన్న ఈ గ్రామం తర్వాత పాక్ లో కలిసింది. దేశం రెండు ముక్కలయ్యాక చాలా కుటుంబాలు పాక్ నుంచి ఇండియాకు వచ్చేశాయి. అలా వచ్చిన కుటుంబాలలో మన్మోహన్ సింగ్ కుటుంబం కూడా ఒకటి. భారత ప్రధానిగా పదేళ్ల పాటు దేశానికి సేవలందించిన మన్మోహన్ సింగ్.. పాక్ లో పర్యటించినప్పటికీ తన స్వంత గ్రామానికి మాత్రం వెళ్లలేకపోయారు. ఒకసారి గాహ్ నుంచి ఢిల్లీకి వచ్చిన తన చిన్ననాటి స్నేహితుడిని ఆప్యాయంగా ఆహ్వానించారు.


More Telugu News