7న విచారణకు రండి.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

  • ఇదే కేసులో ఏ2, ఏ3గా ఉన్న అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు
  • జనవరి 2, 3 తేదీల్లో రావాలని ఆదేశం
  • ఫార్ములా ఈ-రేసు కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ
ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీచేసింది. వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాలని అందులో కోరింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డిని వరుసగా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు పిలిచింది. 

ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, అరవింద్ కుమార్ ఏ2గా, బీఎల్ఎన్‌రెడ్డి ఏ3గా కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసులో ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ఫార్ములా ఈ-రేసు కేసులో అనేక ఉల్లంఘనలు జరిగాయన్నది ఏసీబీ వాదన. 

2022లో తొలిసారి జరిగిన ఒప్పందంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని, 2023లో చేసుకున్న ఒప్పందంలో ఒక అడుగు ముందుకు వేసి విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించడం పూర్తిగా నేరపూరిత చర్యేనన్నది ఏసీబీ వాదన. మొత్తం రూ. 54.9 కోట్లను కేటీఆర్ ఆదేశాలతోనే ఖర్చు చేశారని ఏసీబీ ధ్రువీకరించింది.  


More Telugu News