శవం పార్సిల్ కేసులో వీడుతున్న చిక్కుముడి!

  • పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో కలకలం రేపిన పార్సిల్ శవం
  • వదిన ఆస్తి కాజేసేందుకు భార్య, ప్రియురాలితో కలిసి మరిది పన్నాగం
  • శవాన్ని పంపి భయపెట్టాలని పథకం
  • శవం దొరక్కపోవడంతో వ్యక్తిని హత్య చేసి మరీ పార్సిల్ చేసిన వైనం
  • ఆపై విషయం బయటపడటంతో ప్రియురాలు, కుమార్తెతో కలిసి పరారీ
  • పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 40 సిమ్‌కార్డులు మార్చిన నిందితుడు
పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలోని ఓ ఇంటికి పార్శిల్‌లో వచ్చిన మృతదేహం కేసులో చిక్కుముడి దాదాపు వీడింది. వదిన తులసి ఆస్తిని కాజేసేందుకు నిందితుడు శ్రీధర్‌వర్మే ఇదంతా చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడు, ఆమె రెండో భార్య (తులసి చెల్లెలు), ప్రియురాలు సుష్మ కలిసి పర్లయ్యను హత్యచేసినట్టు విచారణలో అంగీకరించినట్టు తెలిసింది. 

శవం దొరక్కపోవడంతో హత్య
పోలీసుల కథనం ప్రకారం.. తులసి ఇంటికి శవాన్ని పంపి ఆమెను భయపెట్టాలని పథక రచన చేశారు. అందులో భాగంగా శవం కోసం గాలించారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను హతమార్చాలని నిర్ణయించారు. అతడికి మద్యం తాగించి మత్తులో ఉండగా కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకు నైలాన్ తాడు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత పర్లయ్య శవాన్ని చెక్కపెట్టెలో పెట్టి తులసి ఇంటికి పార్సిల్ చేశారు.

సంతకం పెడితే శవం మాయం చేస్తానని హామీ
పార్సిల్‌లోని శవాన్ని చూసిన తులసి భయంతో హడలిపోయింది. అది గమనించిన శ్రీధర్‌వర్మ ఆస్తి పత్రాలపై సంతకం చేస్తే విషయం బయటకు పొక్కకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆమె నిరాకరించడంతో ‘‘సంతకం పెడతావా? లేదంటే నువ్వు కూడా శవమవుతావా?’’ అని బెదిరించాడు. ఆమె సెల్‌ఫోన్‌ను లాగేసుకున్నాడు. దీంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాష్‌రూముకు వెళ్తానని చెప్పి తన వద్దనున్న మరో ఫోన్ ద్వారా తెలిసిన వారికి మెసేజ్ పంపింది. ఆ వెంటనే కొందరు తులసి ఇంటికి చేరుకుని ఏం జరిగిందని ఆరా తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించడంతో శ్రీధర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

ప్రియురాలు, కుమార్తెతో పరారీ
తులసి ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీధర్ ప్రియురాలు సుష్మ, కుమార్తెతో కలిసి కారులో కృష్ణా జిల్లా బంటుమిల్లి మీదుగా మంగినపూడి బీచ్‌కు చేరుకున్నాడు. అక్కడ తాళ్లపాలెంలో కారును వదిలేసి లాడ్జిలో ఒక రోజు బస చేశారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. చివరికి అక్కడ పోలీసులకు దొరికిపోయారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ఏకంగా 40 సిమ్‌కార్డులను మార్చినట్టు గుర్తించారు. అలాగే, అతడి ఖాతాలో రూ. 2 కోట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నేడు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.


More Telugu News