మన్మోహన్ మృతి: బ్యాంకులు, స్కూళ్లకు సెలవా? కాదా?.. ఇంటర్నెట్‌లో తెగ వెతుకులాట!

  • వారం రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
  • విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించిన కర్ణాటక
  • తెలంగాణలోనూ సెలవు ప్రకటన
  • బ్యాంకుల సంగతేంటన్న దానిపై స్పష్టత కరవు
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మృతికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారం రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ ఏడు రోజులపాటు దేశవ్యాప్తంగా భారత పతకాన్ని అవనతం చేస్తారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు వెళ్లాయి. సంతాప దినాల్లో ఎలాంటి వినోద కార్యక్రమాలు చేపట్టరు. ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశమై సంతాప దినాలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చిస్తుంది. 

మన్మోహన్ మృతి సందర్భంగా కేంద్రం వారం రోజులు సంతాప దినాలు ప్రకటించగానే కర్ణాటక ప్రభుత్వం నేడు (శుక్రవారం) స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు నేడు సెలవా? కాదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌ను తెగ వెతికారు. 

కర్ణాటక ప్రభుత్వ ప్రకటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా నేడు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీలోని అతిశీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది.

కర్ణాటక ప్రభుత్వం కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన తర్వాత మరి బ్యాంకుల సంగతేంటని కూడా చాలామంది ఇంటర్నెట్‌ను వెతికారు. భారతీయ రిజర్వు బ్యాంకు సెలవుల క్యాలెండర్ ప్రకారం.. నాగాలాండ్‌లోని కోహిమా ప్రాంతంలో మాత్రమే నేడు బ్యాంకులకు సెలవు. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్కడ సెలవు ప్రకటించారు. అయితే, ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు పాటిస్తున్నాయా? లేదా? అన్నదానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.


More Telugu News