కామారెడ్డిలో కలకలం .. అనుమానాస్పద పరిస్థితులలో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి

  • కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో చెరువు వద్ద గాలింపు చర్యలు
  • చెరువు నుంచి ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతదేహాల వెలికితీత
  • పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య వ్యవహారం
బిక్కనూరు పోలీస్ స్టేషన్‌ సబ్ ఇన్స్‌పెక్టర్ సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి, సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్‌ నిఖిల్ ఆత్మహత్య చేసుకోవడం కామారెడ్డి జిల్లాలో కలకలాన్ని రేపింది. సిదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి గురువారం ఉదయం రెస్క్యూ బృందాలు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహాన్ని వెలికితీశాయి. బుధవారం రాత్రి ఇదే చెరువు నుంచి కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను బయటకు తీశారు. 

ఎస్ఐ సాయికుమార్‌తో పాటు మహిళా కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ అనే యువకుడు నిన్న మధ్యాహ్నం ఒకేసారి అదృశ్యం కావడం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగించగా, గురువారం ఉదయం ఎస్ఐ సాయికుమార్ మృతదేహం లభ్యమైంది. 

ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శ్రుతితో పాటు యువకుడు నిఖిల్ కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా ? వారి మధ్య గొడవలు ఏమిటి..? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ? అనేది మిస్టరీగా మారింది. సాయికుమార్ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్‌లో పని చేశాడు. శ్రుతి కూడా అక్కడ కానిస్టేబుల్‌గా పని చేసింది. సాయికుమార్ బిక్కనూరుకు బదిలీ కాగా, శ్రుతి బీబీపేటలోనే కానిస్టేబుల్‌గా కొనసాగుతోంది. 

బీబీపేటకు చెందిన నిఖిల్ అనే యువకుడు సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తూ కంప్యూటర్‌లు రిపేరు చేస్తుంటారు. పోలీస్ స్టేషన్‌లో కంప్యూటర్లకు కూడా ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వెళ్లి రిపేరు చేస్తుంటాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్య ఏమి జరిగింది..? గొడవ ఏమిటి..? ముగ్గురూ ఒకే ప్రదేశానికి వెళ్లి ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు..? అనే విషయాలు పోలీస్ దర్యాప్తు అనంతరం తెలిసే అవకాశం ఉంటుంది. ఈ వ్యవహారం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశం అయింది. 
 
విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. బీబీపేట పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. అయితే మధ్యాహ్నమైనా కుమార్తె ఇంటికి రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్‌లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్ నుంచి ఉదయమే వెళ్లిపోయిందని సిబ్బంది చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెంది వెంటనే అధికారులను సంప్రదించారు. 

అధికారులు స్పందించి ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేయడంతో సదాశివనగర్ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకోవడంతో అక్కడ శ్రుతి సెల్ ఫోన్తో పాటు నిఖిల్ సెల్ ఫోన్ కూడా దొరికింది. సమీపంలోనే ఎస్ఐ సాయికుమార్‌కు చెందిన కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలూ కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించగా, ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.  


More Telugu News