సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. హాజ‌ర‌య్యే సినీ ప్ర‌ముఖులు ఎవ‌రంటే..!

  • ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో ఉద‌యం 10 గంట‌ల‌కు సీఎంతో భేటీ
  • తాజా ప‌రిణామాలు, చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై స‌మావేశంలో చ‌ర్చ‌
  • ఈ భేటీకి మా అసోసియేష‌న్, ఫిల్మ్ ఛాంబ‌ర్‌, ఫెడ‌రేష‌న్ నుంచి 36 మంది స‌భ్యుల బృందం
మ‌రికొద్దిసేప‌ట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్ర‌ముఖులు భేటీ కానున్నారు. టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో ముఖ్య‌మంత్రితో స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశం బంజారాహిల్స్‌లోని పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది.

ఇక ఈ భేటీకి మా అసోసియేష‌న్, ఫిల్మ్ ఛాంబ‌ర్‌, ఫెడ‌రేష‌న్ నుంచి 36 మంది స‌భ్యుల బృందం హాజ‌రుకానుంది. నిర్మాత‌లు డి. సురేశ్ బాబు, అల్లు అర‌వింద్‌, సుప్రియ, నాగ‌వంశీ, ర‌విశంక‌ర్‌, సునీల్ నారంగ్‌, న‌వీన్ ఎర్నేని.. హీరోలు వెంక‌టేశ్, నితిన్‌, వ‌రుణ్ తేజ్‌, శివ‌బాలాజీ, కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో పాటు ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, హ‌రీశ్ శంక‌ర్‌, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ త‌దిత‌రులు క‌లిసే అవ‌కాశం ఉంది. 
 
అటు ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ స‌మావేశంలో సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు.

కాగా, సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న త‌ర్వాత ప్ర‌భుత్వం వైఖ‌రి మారింది. ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఇక‌పై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని అన్నారు. తాను ముఖ్య‌మంత్రిగా ఉన్నంత‌వ‌ర‌కూ సినిమా వాళ్లకు ఎలాంటి ప్రత్యేక సౌక‌ర్యాలు ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పారు. దీంతో నేడు జ‌ర‌గ‌బోయే స‌మావేశం ప్రాధాన్య‌తను సంత‌రించుకుంది. 


More Telugu News