బాక్సింగ్ డే టెస్టు.. టాస్ గెలిచిన ఆసీస్.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పు!

  • మెల్‌బోర్న్ వేదిక‌గా ఆసీస్‌, భార‌త్ నాలుగో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • గిల్ స్థానంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు చోటు
  • రోహిత్ శ‌ర్మ మ‌ళ్లీ ఓపెనింగ్‌
మెల్‌బోర్న్ వేదికగా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మొద‌ట టాస్ గెలిచిన ఆతిథ్య జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టులో కీల‌క మార్పు చోటు చేసుకుంది. స్టార్ ప్లేయ‌ర్ శుభ్‌మాన్ గిల్‌ను టీమిండియా త‌ప్పించింది. అత‌ని స్థానంలో స్పిన్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను జ‌ట్టులోకి తీసుకుంది. 

అలాగే గ‌త మ్యాచ్‌లో త‌న ఓపెనింగ్ స్థానాన్ని వ‌దులుకున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌.. ఈ మ్యాచ్‌లో తిరిగి ఓపెన‌ర్‌గా రానున్నాడు. యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్‌తో క‌లిసి హిట్‌మ్యాన్ ఓపెనింగ్ చేయ‌నున్నాడు. 

అటు ఆతిథ్య జట్టు రెండు భారీ మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ చోటు ద‌క్కించుకున్నాడు. అలాగే స్టార్ ప్లేయ‌ర్‌, ఓపెన‌ర్ నాథన్ మెక్‌స్వీని జ‌ట్టు నుంచి త‌ప్పించి, అత‌ని స్థానంలో 19 ఏళ్ల‌ యువ ఆట‌గాడు సామ్ కొన్‌స్టాస్‌కు చోటు క‌ల్పించింది.  

ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 11 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 62 ప‌రుగులు చేసింది. కొన్‌స్టాస్ (45), ఉస్మాన్ ఖ‌వాజా (16) క్రీజులో ఉన్నారు.

కాగా, ఐదు మ్యాచుల బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఇప్ప‌టికే మూడు టెస్టులు ముగిశాయి. ఇందులో పెర్త్‌లో జ‌రిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ త‌ర్వాత అడిలైడ్‌లో జ‌రిగిన రెండో టెస్టులో ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో భార‌త్‌ను చిత్తుచేసింది. బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ప్ర‌స్తుతం ఇరు జ‌ట్లు 1-1తో స‌మంగా ఉన్నాయి. దీంతో నాలుగో టెస్టులో గెలిచి ఆధిక్యం సాధించాల‌ని రెండు జ‌ట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. 

ఆస్ట్రేలియా జ‌ట్టు: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్‌, మార్నస్ లాబుషేన్‌, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్,  అలెక్స్ కారీ (వికెట్ కీప‌ర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయ‌న్, స్కాట్ బోలాండ్

భారత జ‌ట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


More Telugu News