ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: ఎమ్మెల్సీ కవిత

  • మహిళలను ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని విమర్శ
  • ఆడబిడ్డకు ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.30 వేలు బాకీ పడిందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ఏడాది పాలనలో నేరాలు 40 శాతం పెరిగాయని విమర్శ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మెదక్ చర్చిని సంద‌ర్శించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయన్నారు. మహిళలను ఈ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు.

ప్రతి మహిళకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఆ హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలోని ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.30 వేలు బాకీ పడిందన్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీ ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో నేరాలు 40 శాతం పెరిగాయన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మహిళలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. హామీలపై మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారన్నారు. రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దని డిమాండ్ చేశారు. మొక్కజొన్నలు, కందులు, సోయాబీన్, పత్తి వంటి పంటలకు మద్దతు ధర పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికీ రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రేషన్ బియ్యం ఇవ్వాలన్నారు.


More Telugu News