శ్రీతేజ్‌ను పరామర్శించాలని సినీ ప్రముఖులకు ఉన్నప్పటికీ పరిధి ఉంటుంది: జానీ మాస్టర్

  • కొన్ని పరిధుల వల్లనే పరామర్శించలేకపోతున్నారని వెల్లడి
  • శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్
  • జైలు నుంచి బయటకు వచ్చాక కుటుంబానికే సమయం కేటాయిస్తున్నట్లు వెల్లడి
సినీ పరిశ్రమకు చెందిన చాలామందికి శ్రీతేజ్‌ను పరామర్శించాలని ఉంటుందని, కానీ కొన్ని పరిధులు ఉంటాయని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. అలాంటి పరిధుల వల్ల వారు వచ్చి పరామర్శించలేకపోవచ్చునన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట సందర్భంగా తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను, అతని కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... డ్యాన్సర్ యూనియన్ తరఫున శ్రీతేజ్‍‌కు సాయం అందిస్తామన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగవుతుందని, అతను త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అతని కుటుంబానికి అండగా ఉంటామని, ఈ మేరకు కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పామన్నారు.

ఈ సంఘటన తర్వాత తాను అల్లు అర్జున్‌ను కలవలేదని, తాను జైలు నుంచి బయటకు వచ్చాక కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు వచ్చే సాంగ్స్ రిహార్సల్స్ చేసుకుంటూ ఫ్యామిలీతో సమయం గడుపుతూ సంతోషంగా ఉన్నానన్నారు. ప్రస్తుతం తన కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అందుకు సంబంధించిన అంశాలు మాట్లాడలేనన్నారు.


More Telugu News