బాక్సింగ్ డే టెస్టులో రెండు భారీ మార్పుల‌తో బ‌రిలోకి ఆసీస్‌.. 19 ఏళ్ల‌ యువ ఆట‌గాడికి చోటు

  • మెల్‌బోర్న్ వేదిక‌గా ఆసీస్‌, భార‌త్ నాలుగో టెస్టు
  • గాయ‌ప‌డిన హేజిల్‌వుడ్ స్థానంలో జ‌ట్టులోకి స్కాట్ బోలాండ్
  • ఓపెన‌ర్ నాథన్ మెక్‌స్వీనీ జ‌ట్టు నుంచి త‌ప్పించిన ఆసీస్‌
  • అత‌ని స్థానంలో యువ ఆట‌గాడు సామ్ కొన్‌స్టాస్‌కు చోటు
మెల్‌బోర్న్ వేదిక‌గా గురువారం నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ టెస్టులో ఆతిథ్య జట్టు రెండు భారీ మార్పులు చేసింది. గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి చోటు ద‌క్కించుకున్నాడు.

 అలాగే స్టార్ ప్లేయ‌ర్‌, ఓపెన‌ర్ నాథన్ మెక్‌స్వీనీ జ‌ట్టు నుంచి త‌ప్పించింది. అత‌ని స్థానంలో 19 ఏళ్ల‌ యువ ఆట‌గాడు సామ్ కొన్‌స్టాస్‌కు చోటు క‌ల్పించింది. దీంతో ఉస్మాన్ ఖ‌వాజాతో క‌లిసి ఈ యంగ్ ప్లేయ‌ర్ ఓపెనింగ్ చేయ‌నున్నాడు. కాగా, పింక్-బాల్ టెస్ట్‌కు ముందు కాన్‌బెర్రాలో టీమిండియాతో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌ ప్రాక్టీస్ మ్యాచులో కొన్‌స్టాస్ సెంచరీతో అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే.

ఇక గాయ‌ప‌డిన స్టార్ బ్యాట‌ర్ ట్రావిస్ హెడ్ కూడా కోలుకొని జ‌ట్టులో కొన‌సాగుతున్నాడు. అడిలైడ్, బ్రిస్బేన్ రెండు టెస్టుల్లోనూ సెంచరీలు బాదిన హెడ్ ఐదు మ్యాచుల సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు.  

కాగా, గబ్బా టెస్టులో హెడ్‌ తొడ కండరాలు ప‌ట్టేయ‌డంతో అతని ఫిట్‌నెస్ విష‌యంలో ఆందోళనలు నెల‌కొన్నాయి. అయితే, ప్ర‌స్తుతం ఈ ఎడమచేతి వాటం ప్లేయ‌ర్‌ బాగానే ఉన్నాడని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. అతను పూర్తి ఫిట్‌గా మ్యాచులోకి దిగుతున్న‌ట్లు పేర్కొన్నాడు. ఇక ఇటీవ‌ల అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న హెడ్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ప్రధానంగా భార‌త్‌పై అన్ని ఫార్మాట్ల‌లో అత‌డు రెచ్చిపోతున్నాడు. 

ఇదిలాఉంటే.. ఐదు మ్యాచుల బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఇప్ప‌టికే మూడు టెస్టులు ముగిశాయి. ఇందులో పెర్త్‌లో జ‌రిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ త‌ర్వాత అడిలైడ్‌లో జ‌రిగిన రెండో టెస్టులో ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో భార‌త్‌ను చిత్తుచేసింది. బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ప్ర‌స్తుతం ఇరు జ‌ట్లు 1-1తో స‌మంగా ఉన్నాయి. 

బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదే..
ప్యాట్ క‌మ్మిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్‌, సామ్ కొన్‌స్టాస్, అలెక్స్ కెరీ, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయ‌న్, స్కాట్ బోలాండ్.


More Telugu News