18 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థులు

  • జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి గురుకుల పాఠశాలలో ఘటన
  • బీచుపల్లి నుంచి గద్వాలకు నడుచుకుంటూ వచ్చిన 200 మంది విద్యార్థులు
  • క్రమశిక్షణ పేరుతో వేధిస్తున్నాడని ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు
  • విద్యార్థులు చెడు అలవాట్లు చేసుకుంటున్నందున హెచ్చరించానన్న ప్రిన్సిపల్
తమను ప్రిన్సిపల్ వేధిస్తున్నాడంటూ ఓ గురుకుల పాఠశాల విద్యార్థులు ఏకంగా 18 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి గవర్నమెంట్ బాయ్స్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.

గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని దాదాపు 200 మంది విద్యార్థులు నడుచుకుంటూ వచ్చారు. మంగళవారం స్కూల్, కాలేజీ ప్రహరీ గోడను దూకి కాలినడకన బీచుపల్లి నుంచి గద్వాలలోని కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్రగా వచ్చారు. విద్యార్థులు ర్యాలీగా వెళ్లడం చూసి పోలీసులు బందోబస్తుగా వెళ్లారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ... ప్రిన్సిపల్ నిత్యం క్రమశిక్షణ పేరుతో కొడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వలేదని, గురుకులలో మరుగుదొడ్లు కూడా సరిగ్గా లేవని వాపోయారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, ఆరో తరగతిలో మిగిలిన సీట్లను అమ్ముకున్నారని ఆరోపించారు.

విద్యార్థుల ఫిర్యాదుపై ప్రిన్సిపల్ స్పందించారు. పలువురు విద్యార్థులు ఉపాధ్యాయుల అనుమతి లేకుండానే బయటకు వెళ్లి చెడు అలవాట్లు చేసుకుంటున్నారని, దీంతో తాను హెచ్చరించాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించినట్లు చెప్పారు. విద్యార్థులను తాను ఇబ్బంది పెట్టలేదన్నారు.


More Telugu News