చంద్రబాబు పీఏను అంటూ మోసం... రంజీ మాజీ క్రికెటర్‌పై విజయవాడలో కేసు

  • అసిస్టెంట్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసరావు పేరుతో మోసానికి యత్నం
  • ఏపీ క్రికెటర్ రికీ భుయ్‌కి స్పాన్సర్ చేయాలని వాట్సాప్ సందేశాలు
  • తన పేరుతో డబ్బులు అడుగుతున్నట్లుగా గుర్తించి ఫిర్యాదు చేసిన శ్రీనివాసరావు
  • మాజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజుపై సైబర్ క్రైమ్ పోలీసుల కేసు
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో పలువురికి వాట్సాప్ సందేశాలు పంపుతూ మోసం చేసేందుకు ప్రయత్నించిన మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజుపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ క్రికెటర్ రికీ భుయ్‌కి స్పాన్సర్ చేయాలని, క్రికెట్ కిట్లు కొనుగోలు చేయడానికి డబ్బులు పంపించాలంటూ ఏపీ సీఎం పీఏ పేరుతో నాగరాజు పలువురికి మెసేజ్‌లు పంపించాడు.

రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న పెండ్యాల శ్రీనివాసరావు పేరుతో నాగరాజు ఈ మోసాలకు పాల్పడే ప్రయత్నం చేశాడు. వాట్సాప్‌లో చంద్రబాబుతో శ్రీనివాసరావు కలిసి ఉన్న ఫొటోను పంపిస్తూ... తాను సీఎం పర్సనల్ సెక్రటరీని అని నమ్మించే ప్రయత్నం చేశాడు.

తన పేరుతో ఎవరో పలు కార్పోరేట్ కంపెనీలకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్న విషయాన్ని గుర్తించిన శ్రీనివాసరావు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జులై 3న పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే నాగరాజు మరోసారి అదే తరహా మోసానికి పాల్పడ్డాడు. డబ్బులు పంపించాలంటూ ఇటీవల కూడా సందేశాలు పంపించాడు. ఈ విషయం తన దృష్టికి రావడంతో శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ పోలీసులను మరోసారి ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


More Telugu News