ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ 20 లక్షల ఇళ్లు నిర్మిస్తాం!: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేలో వేగం పెరిగిందన్న మంత్రి
  • 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి మొదటి వారానికి పూర్తవుతుందన్న మంత్రి
  • సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని, అయినప్పటికీ తాము నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మించి తీరుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొత్త ఏడాదిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేలో వేగం పెరిగిందని, ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్ సైట్, టోల్ ప్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

హిమాయత్ నగర్‌‍లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన ఉన్నతాధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి మొదటి వారానికి పూర్తవుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్‌ను తిరిగి బలోపేతం చేస్తున్నామన్నారు. వివిధ విభాగాల్లో ఉన్న కార్పొరేషన్ ఉద్యోగులను 95 శాతం వెనక్కి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అన్నారు. త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామన్నారు.


More Telugu News