సినిమా టికెట్ రేట్లపై చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకోవాలి: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

  • బెనిఫిట్ షోలు రద్దు చేయాలనే రేవంత్ నిర్ణయం హర్షదాయకమన్న కేతిరెడ్డి
  • చంద్రబాబు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని విన్నపం
  • ప్రతి సినిమాకు రేట్లు పెంచే విధానానికి స్వస్తి పలకాలని వ్యాఖ్య
'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ స్వాగతించింది. ఈ నేపథ్యంలో ఏపీ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండనవి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం హర్షదాయకమని కేతిరెడ్డి చెప్పారు. ఈ ప్రకటనపై ప్రేక్షకులు, సినీ పరిశ్రమను నమ్ముకున్న ఎందరో సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఇంతకాలం పెంచిన టికెట్ ధరల కారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గారని చెప్పారు. ఇప్పుడు సగటు ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి సంతోషంగా థియేటర్లకు వస్తాడని అన్నారు. 

టికెట్ ధరల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని కేతిరెడ్డి కోరారు. ప్రతి సినిమాకు రేట్ పెంచే విధానానికి స్వస్తి పలకాలని అన్నారు. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేలా మార్గదర్శకాలను రూపొందించేందుకు... నిపుణుల కమిటీని నియమించాలని... ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.  


More Telugu News