అంబేద్కర్‌ను మానసిక క్షోభకు గురిచేసింది కాంగ్రెస్సే: దగ్గుబాటి పురందేశ్వరి

  • అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీయే అవమానించిందన్న బీజేపీ ఎంపీ
  • ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్‌లో అడుగుపెట్టనీయలేదంటూ ఆరోపణ
  • రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని, మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ, హస్తం పార్టీలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

బీఆర్ అంబేద్కర్‌ను రెండు పర్యాయాలు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్‌లో అడుగు పెట్టనీయకుండా కాంగ్రెస్ పార్టీయే ఆయనను మానసిక క్షోభకు గురిచేసిందని పురందేశ్వరి ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాతను తీవ్రంగా అవమానించారని ఆమె మండిపడ్డారు. అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న పార్టీ బీజేపీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పురందేశ్వరి అన్నారు. వాజ్‌పేయి  ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ‘భారతరత్న’ అవార్డ్ ప్రకటించామని ఆమె ప్రస్తావించారు.

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై స్పందించిన పురందేశ్వరి ... థియేటర్ వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు. ఏపీలో 25 లక్షలకు పైగా బీజేపీ సభ్యత్వాలు నమోదవుతున్నాయని ఆమె వెల్లడించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో పురందేశ్వరి మాట్లాడారు.


More Telugu News