చావు అంచుల దాకా వెళ్లిరావడమంటే ఇదేనేమో.. వీడియో ఇదిగో!

  • బైక్ ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్ 
  • అరిచి కేకలు పెడుతున్నా ట్రక్ ఆపకుండా వెళ్లిన డ్రైవర్
  • ఓవర్ టేక్ చేసి ఆపిన బైకర్.. ట్రక్ డ్రైవర్ కు స్థానికుల దేహశుద్ధి
  • ఆగ్రా హైవేపై చోటుచేసుకున్న దారుణ ఘటన 
ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు యువకులు చావు అంచుల దాకా వెళ్లొచ్చారు. వేగంగా వెళుతున్న ట్రక్ ఈడ్చుకెళుతుంటే.. సాయం కోసం అరుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరిలో ఓ యువకుడి తల ట్రక్ ముందు టైర్ కు అడుగు దూరంలో ఉండడం చూసి ఇతర వాహనాల ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఓ బైకర్ ఓవర్ టేక్ చేసి ట్రక్ ను ఆపేయడంతో ఆ యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.

ఆదివారం రాత్రి ఆగ్రా హైవేపై చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.. ఆగ్రాకు చెందిన జకీర్ తన స్నేహితుడితో కలిసి హోటల్ లో డిన్నర్ చేసి బైక్ పై ఇంటికి బయలుదేరాడు. ఆగ్రా హైవేపై వెళుతుండగా ఓ ట్రక్ వారిని ఢీ కొట్టింది. దీంతో జకీర్, ఆయన స్నేహితుడు కిందపడగా.. ట్రక్ డ్రైవర్ బండిని ఆపకపోవడంతో బైక్ తో పాటు యువకులు ఇద్దరూ ఇరుక్కుపోయారు.

దాదాపు 300 మీటర్లు ట్రక్ వారిని ఈడ్చుకెళ్లింది. ప్రాణభయంతో వారు కేకలు పెడుతుండడం చూసి ఇతర వాహనదారులు ట్రక్ ను ఆపేందుకు ప్రయత్నించారు. అయినా డ్రైవర్ ట్రక్ ఆపకుండా మరింత స్పీడ్ పెంచాడు. ఓ బైకర్ ఓవర్ టేక్ చేసి బండిని అడ్డంగా నిలపడంతో ట్రక్ డ్రైవర్ బ్రేక్ వేశాడు. యువకులు ఇద్దరినీ కాపాడిన వాహనదారులు.. అంబులెన్స్ కు, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

పోలీసులు వచ్చేలోగా ట్రక్ డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం జకీర్, ఆయన స్నేహితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రక్ ఈడ్చుకెళ్లడంతో వారికి గాయాలయ్యాయని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.


More Telugu News