బంగాళాఖాతంలో తీవ్ర అల్ప‌పీడ‌నం.. కోస్తా జిల్లాల‌కు పొంచి ఉన్న భారీ వ‌ర్షాల ముప్పు!

  • ఏపీ, ఉత్త‌ర త‌మిళ‌నాడు తీరాల వైపు అల్ప‌పీడ‌నం
  • ప్ర‌స్తుతం తీరానికి స‌మీపంలో క‌దులుతుండ‌డంతో చ‌లిగాలులు వీస్తున్న వైనం 
  • దీని ప్ర‌భావంతో గురువారం వ‌ర‌కు రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు
బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న‌ తీవ్ర అల్ప‌పీడ‌నం కార‌ణంగా ఏపీలోని కోస్తా జిల్లాల‌కు భారీ వ‌ర్షాల ముంపు పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఏపీ, ఉత్త‌ర త‌మిళ‌నాడు తీరాల వైపు అల్ప‌పీడ‌నం ప‌య‌నిస్తోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. ప్ర‌స్తుతం తీరానికి స‌మీపంలో క‌దులుతున్న నేప‌థ్యంలో మేఘాలు క‌మ్ముకుని, చ‌లిగాలులు వీస్తున్నాయి. దీని ప్ర‌భావంతో గురువారం వ‌ర‌కు రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. 

ఇక ఈరోజు విశాఖ‌, అన‌కాప‌ల్లి, కాకినాడ‌, గుంటూరు, బాప‌ట్ల‌, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, అల్లూరి సీతారామ‌రాజు, పార్వ‌తిపురం మ‌న్యం, ప‌ల్నాడు, ప్ర‌కాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, డా. బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ, కృష్ణా, ఎన్‌టీఆర్‌ జిల్లాల్లో ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. 

అలాగే బుధ‌వారం నాడు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుప‌తి, ప‌ల్నాడు, బాప‌ట్ల‌, ప్ర‌కాశం జిల్లాల్లో ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. సముద్రంలో గ‌రిష్ఠంగా గంట‌కు 55 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నందున బుధ‌వారం వ‌ర‌కు మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్లొద్ద‌ని విశాఖ వాతావ‌రణ‌ కేంద్రం హెచ్చ‌రించింది. 

రాష్ట్రంలోని గంగ‌వ‌రం, కాకినాడ‌, నిజాంప‌ట్నం, కృష్ణ‌ప‌ట్నం, విశాఖ‌ప‌ట్నం, మ‌చిలీప‌ట్నం, క‌ళింగ‌ప‌ట్నం స‌హా త‌మిళ‌నాడులోని వివిధ పోర్టుల్లో మూడో నెంబ‌రు ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు కొన‌సాగుతున్నాయి. 


More Telugu News