షేక్ హసీనాను అప్పగించండి: భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ

  • ఢాకాలోని భారత దౌత్య కార్యాలయంలో లేఖ సమర్పించిన బంగ్లాదేశ్
  • దౌత్యపరంగా భారత్‌ను అభ్యర్థించినట్లు తెలిపిన బంగ్లాదేశ్
  • లేఖ వచ్చిందన్న భారత విదేశాంగ శాఖ
మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. షేక్ హ‌సీనాను అప్పగించాలని కోరుతూ రాసిన లేఖ‌ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న భారత దౌత్య కార్యాలయంలో అందించినట్టు బంగ్లాదేశ్ హోంశాఖ సలహాదారు జ‌హంగీర్ ఆల‌మ్ వెల్లడించారు.

షేక్ హ‌సీనా హయాంలో ప్రభుత్వాధికారులు ఊచ‌కోత‌కు పాల్ప‌డిన‌ట్లు భారత్‌కు పంపిన ఆ లేఖ‌లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆరోపించింది. షేక్ హ‌సీనాపై న్యాయ‌విచార‌ణ చేప‌ట్టేందుకు ఢాకాకు పంపించాలని భార‌త్‌ను దౌత్య‌ప‌రంగా అభ్య‌ర్థించిన‌ట్లు తాత్కాలిక ప్ర‌భుత్వ విదేశీ వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో ఆమె దేశం వదిలి వచ్చారు. ఆమె ఆగస్ట్ నుంచి భారత్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో షేక్ హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ లేఖ రాసింది. వ్యక్తుల అప్పగింతకు సంబంధించి భారత్-బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం ఉందని, దీని ప్రకారం హసీనాను స్వదేశానికి తీసుకురావొచ్చని జహంగీర్ ఆలమ్ తెలిపారు.

లేఖ వచ్చింది: విదేశాంగ శాఖ

బంగ్లాదేశ్ హైకమిషన్ నుంచి లేఖ అందిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనాను ఢాకాకు పంపించాలంటూ ఈరోజు లేఖ వచ్చిందన్నారు. ప్రస్తుతం దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమన్నారు.


More Telugu News