తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది: కోమటిరెడ్డి

  • సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్
  • శ్రీతేజ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉందన్న మంత్రి
  • సంధ్య ఘటనను రాజకీయం చేయడం సరికాదని వ్యాఖ్య
  • అల్లు అర్జున్ ఇంటిపై జేఏసీ నేతల దాడిని ఖండించిన మంత్రి
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, కోలుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందారు. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈరోజు శ్రీతేజ్‌ను మంత్రి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సంధ్య థియేటర్ ఘటనపై రాజకీయం చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారన్నారు.

సినిమా పరిశ్రమకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఇంటిపై నిన్న విద్యార్థి జేఏసీ నేతలు చేసిన దాడిని మంత్రి ఖండించారు. అల్లు అర్జున్ ఇంటిపై జేఏసీ నేతల దాడి సరికాదన్నారు. ఇళ్ల మీద దాడులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


More Telugu News