మస్క్ కు ఆ ఛాన్స్ లేదంటున్న ట్రంప్

  • భవిష్యత్తులో మస్క్ అమెరికా అధ్యక్షుడు కావొచ్చా అంటే కుదరదని వెల్లడి
  • రాజ్యాంగం ప్రకారం అమెరికాలో పుట్టిన వారికే ఆ ఛాన్స్ ఉంటుందని వివరణ
  • ఎలాన్ మస్క్ అమెరికాలో పుట్టకపోవడంతో అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం లేదన్న ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 22న బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఎన్నికలలో ట్రంప్ గెలుపునకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎంతగానో కృషి చేశారు. భారీ మొత్తంలో విరాళం అందించడంతో పాటు ట్రంప్ తో కలిసి ప్రచార సభలలో పాల్గొన్నారు. తన సోషల్ మీడియా కంపెనీ ‘ఎక్స్’ ద్వారా ట్రంప్ ను గెలిపించాలంటూ ప్రచారం చేశారు. దీంతో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ కీలక బాధ్యతలను మస్క్ కు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే ట్రంప్ పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వంలో మస్క్ కీలకంగా మారనున్న విషయం స్పష్టంగా కనిపిస్తుండడంతో భవిష్యత్తులో అధ్యక్షుడు కూడా కావొచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

దీనిపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశం ఎలాన్ మస్క్ కు లేదని స్పష్టం చేశారు. అమెరికాలో జన్మించిన వారికే అధ్యక్ష బరిలో నిలబడే వీలు ఉంటుందని, మస్క్ కు అమెరికా పౌరసత్వం ఉన్నప్పటికీ ఆయన మన దేశంలో పుట్టలేదని ట్రంప్ గుర్తుచేశారు. అందువల్ల అధ్యక్షుడిగా పోటీ చేయడానికి మస్క్ అనర్హుడని, భవిష్యత్తులోనూ మస్క్ అమెరికా అధ్యక్షుడు కాలేడని స్పష్టం చేశారు. ఈమేరకు అరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్‌ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలను ప్రస్తావించారు. ప్రెసిడెంట్ మస్క్ అంటూ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ మస్క్ అధ్యక్షుడు కాలేరని కచ్చితంగా చెప్పగలనని వివరించారు.

అమెరికా రాజ్యాంగం ప్రకారం..
అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే రాజ్యాంగం ప్రకారం జన్మత: అమెరికా పౌరుడు అయి ఉండాలి. అమెరికా గడ్డ మీద పుట్టిన వారికే ఆ దేశాన్ని పాలించే అవకాశం ఉంటుంది. అమెరికాలో జన్మించకపోయినా ఆ దేశ పౌరసత్వం పొందొచ్చు.. టెక్నికల్ గా అమెరికా పౌరుడే అయినా అమెరికాలో పుట్టని వ్యక్తి ఆ దేశానికి అధ్యక్షుడు కాలేడు. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలాన్ మస్క్ అమెరికా పౌరసత్వం పొందారు.


More Telugu News