కడప సర్వసభ్య సమావేశంలో మేయర్, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం.. వీడియో ఇదిగో!

  • సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవి
  • తనకు కుర్చీ వేయకపోవడంపై మేయర్ పోడియం వద్ద నిరసన
  • టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట
కడప నగరపాలక సంస్థ సర్వ సభ్య సమావేశంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయకపోవడంపై వివాదం రేగింది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు వేదికపై కుర్చీ ఏర్పాటు చేసిన మేయర్.. ఇప్పుడు తనకు కుర్చీ ఏర్పాటు చేయకపోవడంపై మేయర్ సురేశ్ బాబును ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిలదీశారు. తనకు కుర్చీ వేసేదాకా నిలబడే ఉంటానని ఎమ్మెల్యే పట్టుబట్టారు. మేయర్ పోడియం దగ్గర టీడీపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. అటు టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. దీంతో సమావేశం రసాభాసగా మారింది.

కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిలబడే ఉండగా మేయర్ సమావేశం నిర్వహించారు. మేయర్‌ కుర్చీకి ఒక వైపు టీడీపీ, మరో వైపు వైసీపీ కార్పొరేటర్లు నిల్చొని నిరసన తెలిపారు. అక్కడే వాదోపవాదనలు, నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. మేయర్ తీరుకు నిరసనగా టీడీపీ కార్పొరేటర్లు సభలో బైఠాయించగా.. టీడీపీ కార్పొరేటర్లు మేయర్ కు క్షమాపణ చెప్పాలని వైసీపీ కార్పొరేటర్లు బైఠాయించారు. ఈ క్రమంలో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఏడుగురు కార్పొరేటర్లను మేయర్ సురేశ్ బాబు సస్పెండ్ చేశారు. 

ఈ ఘటనపై ఎమ్మెల్యే మాధవీ రెడ్డి స్పందిస్తూ.. వైసీపీకి చెందిన మేయర్ సురేశ్ బాబు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మహిళలంటే వైసీపీ నేతలకు చిన్నచూపు అని, అందుకే మేయర్ తనను నిలబడేలా చేశారని ఆరోపించారు. మహిళలను అవమానపరిస్తే వాళ్ల నాయకుడు సంతోషిస్తాడేమోనని విమర్శించారు. విచక్షణాధికారం ఉందని మేయర్‌ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై చర్చిస్తారనే సమావేశాలు జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు. కాగా, అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల ఆందోళనలతో నగర పాలక సంస్థ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.


More Telugu News