అత్యాధునిక టెక్నాలజీతో చంద్రబాబు నివాసం, పరిసరాల్లో భద్రత

  • తన భద్రతకు ఎక్కువ భద్రతా సిబ్బందిని వాడొద్దన్న చంద్రబాబు
  • టెక్నాలజీని వినియోగించాలని అధికారులకు సూచన
  • భద్రత, నిఘా కోసం డ్రోన్ ను రంగంలోకి దింపిన అధికారులు
తన భద్రత కోసం ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించడం కంటే సాంకేతికతను ఉపయోగించుకుని, భద్రతా చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన సంగతి తెలిసిందే. ఆయన సూచనల మేరకు అధికారులు పలు చర్యలు చేపట్టారు. 

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రత, నిఘా కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్ ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ ప్రతి రెండు గంటలకు ఒకసారి పైకి ఎగిరి... పరిసరాలన్నింటినీ నిశితంగా గమనిస్తూ దృశ్యాలను చిత్రీకరిస్తుంది. 

సాధారణంగా ఉండే పరిస్థితులకు భిన్నంగా ఎక్కడైనా కదలికలు ఉన్నా... కొత్త వస్తువులు లేదా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే మానిటరింగ్ బృందానికి సందేశం పంపుతుంది. డ్రోన్ పంపే డేటాను విశ్లేషించడం ద్వారా ముఖ్యమంత్రి నివాస పరిసర ప్రాంతాల్లో భద్రతను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. టెక్నాలజీని వాడుకోవడం ద్వారా తక్కువ భద్రతా సిబ్బందితో భద్రతను కల్పించే పని జరుగుతోంది. 

మరోవైపు, తాను ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కవ సమయం పాటు ట్రాఫిక్ ను ఆపివేయొద్దని చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. తన ఆదేశాలు సక్రమంగా అమలవుతున్నాయా? లేదా? అనే విషయాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తాను ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోయినట్టు కనిపిస్తే అధికారులను ఆరా తీస్తున్నారు. 

తాను ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు తక్కువ సిబ్బందినే భద్రత కోసం వాడాలని కూడా సీఎం ఆదేశించారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు అనవసరమైన ఆంక్షలు పెడితే ఆ కార్యక్రమాలకు వచ్చేవారు ఇబ్బంది పడతారని... అలాంటి ప్రాంతాల్లో బందోబస్తు, హడావుడి తగ్గించాలని ఆయన సూచించారు.  


More Telugu News