అల్లు అర్జున్‌ను విమ‌ర్శించిన ఏసీపీపై చ‌ర్య‌లు: డీసీపీ

  • ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న ఏసీపీ పబ్బతి విష్ణుమూర్తి
  • ప్రెస్ మీట్ పెట్టి బ‌న్నీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన వైనం
  • విష్ణుమూర్తిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్న‌ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ 
  • ఇలాంటివి మేం అసలు సహించబోమ‌న్న డీసీపీ
మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి, సినీనటుడు అల్లు అర్జున్‌పై తీవ్ర‌ విమర్శలు చేసిన ఏసీపీ పబ్బతి విష్ణుమూర్తిపై చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ వెల్ల‌డించారు. "విష్ణుమూర్తి ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. మా అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన విష్ణుపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ఇలాంటివి మేం అసలు సహించం. అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలకు మేం చింతిస్తున్నాం" అని డీసీపీ పేర్కొన్నారు. 

కాగా, హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్‌లో పెట్టిన‌ మీడియా స‌మావేశంలో బ‌న్నీపై ఏసీపీ విష్ణుమూర్తి తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన‌ సంగ‌తి తెలిసిందే. డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచితంగా మాట్లాడుతున్నారని విష్ణు దుయ్య‌బ‌ట్టారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్‌మీట్ పెట్టవచ్చా? అని ఆయ‌న‌ ప్రశ్నించారు. 

కొందరు నటులు, రాజకీయ నాయకులు పోలీసులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు ఉంటామంటే కుదరదన్నారు. సంధ్య‌ థియేటర్ ఘటనలో ఒక‌రు చనిపోతే వారిని చూడకుండా వెళ్లిపోయారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'ఒక్క పోలీసు అధికారిని కూడా నీ దగ్గరికి రాకుండా చేస్తాం.. ఎలా బయటకి వెళ్తావో ఆలోచించుకో' అని విష్ణుమూర్తి అన్నారు. 

ఇక విష్ణుమూర్తి గ‌తంలో నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా ఉన్న స‌మ‌యంలో అవినీతి వ్య‌వ‌హారంలో స‌స్పెండ్ అయ్యారు. అల్లు అర్జున్ కేసు విచార‌ణ టీంలో విష్ణుమూర్తి లేరు. 


More Telugu News