ముఖ్యమంత్రి భార్యగా కాదు... టీడీపీ కార్యకర్తగా కుప్పం వచ్చా: నారా భువనేశ్వరి

  • కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి
  • నేడు నాలుగవ రోజు పర్యటన
  • ఐదేళ్ల రాక్షస పాలనకు అడ్డుకట్ట పడిందన్న భువనేశ్వరి
  • ప్రతి మూడు నెలలకు ఓసారి కుప్పం వస్తానని వెల్లడి
నిత్యం ప్రజల గురించే తపించే చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుందని నారా భువనేశ్వరి అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనలో అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి గెలవడంతో రాక్షస పాలనకు అడ్డుకట్ట పడిందని అన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో 4వ రోజున రామకుప్పం మండలంలోని చల్దిగానిపల్లిలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో భువనేశ్వరి పాల్గొన్నారు. అనంతరం పలమనేరు నియోజవర్గం వి. కోటలో హెరిటేజ్ సహాయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ప్రతి 3 నెలలకూ కుప్పం వస్తా

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గానికి వచ్చి అభివృద్ధి పనులను దగ్గరుండి చూసుంటానని... మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవడం నా బాధ్యత. అటు మంగళగిరిపై నారా లోకేశ్, ఇక్కడ కుప్పం అభివృద్ధిపై నేనూ ఫోకస్ చేశాము. నేను ఇక్కడికి ముఖ్యమంత్రి భార్యలా రాలేదు... టీడీపీ కార్యకర్తగా వచ్చాను. 

చంద్రబాబు గారు పదేపదే మీ గురించి చెబుతున్నారు. ప్రతి రోజూ కుప్పంలో జరుగుతున్న అభివృద్ధి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు గారి మీద అక్కసుతో కుప్పంలో అభివృద్ధి అన్న మాట వినబడకుండా చేసింది. ఇకపై మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుప్పం అభివృద్ది కోసం చంద్రబాబు గారు 40 పథకాలు తెచ్చారు. 

ప్రతి గ్రామానికి రహదారులు, డ్రైనేజ్, అందరికీ సొంత ఇళ్లు , ఉపాధి కల్పన సహా అన్నింటిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాము. కుప్పం నుంచి ఇకపై వలసలు కూడా ఉండవు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సహా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. మీకు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది. ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.

మహిళలు ఆర్థికంగా బలంగా ఉండాలి

నేను నాలుగు రోజులుగా ప్రతి మీటింగ్ లో నూ మహిళల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను. స్త్రీలు శక్తిమంతులు. మగవారిని మించి పనిచేయగలరు. నేను ఇది చేయలేను అనే భయం లేకుండా ముందడుగు వేయాలి. అప్పుడే అద్భుతాలు సాధించగలరు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, నా నిజం గెలవాలి యాత్ర సమయంలోనూ రాష్ట్రమంతటా మహిళలు నాకు అండగా నిలిచారు. నాకు కొండత ధైర్యాన్నిచ్చి నాలో స్పూర్తిని నింపారు. మీరుణం తీర్చుకోలేము. మీకు అభివృద్ధి ఫలాలు అందేలా చేయడమే మేము చేయగలము. 
 
ప్రత్యేక ఆకర్షణగా మహిళా కార్యకర్తలు

రామకుప్పం మండలం చల్దిగానిపల్లి రహదారి పక్కన భువనేశ్వరి గారిని కలవడం కోసం టీడీపీ మహిళా కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చారు. వారంతా పసుపు రంగు చీరలు ధరించి జై తెలుగుదేశం అని రాసి ఉన్న కళ్లజోళ్లు పెట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారిని చూడగానే భువనేశ్వరి గారు కారు దిగి ఆప్యాయంగా పలకరించారు. వారు ఇచ్చిన చీర, పసుపు కుంకుమను స్వీకరించారు.


More Telugu News