భర్త ప్రాణం తీసిన భార్య అప్పు.. నాగర్ కర్నూల్ లో విషాదం

  • భర్తకు తెలియకుండా రూ.1.50 అప్పు చేసిన భార్య
  • అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి నిలదీయడంతో భర్త మనస్తాపం
  • ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్న అపస్మారకంలోకి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
భార్య చేసిన అప్పు భర్త ప్రాణం తీసింది.. అప్పిచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి నిలదీయడంతో మనస్తాపం చెందిన ఆ భర్త ఇంట్లో ఉరేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఆసుపత్రిలో కన్నుమూశాడు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిందీ విషాద సంఘటన. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మధురానగర్ కాలనీకి చెందిన గున్న ముత్యాలు (56), రజిత భార్యాభర్తలు. ముత్యాలు డీఎంహెచ్ ఓ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తుండేవాడు. రజిత కొంతకాలం నర్సుగా పనిచేసి తర్వాత మానేసింది.

ఈ క్రమంలోనే ముత్యాలుకు తెలియకుండా రజిత ఓ వ్యక్తి వద్ద రూ.1.50 లక్షలు అప్పు చేసింది. తిరిగి చెల్లించడంలో జాప్యం జరుగుతుండడంతో సదరు వడ్డీ వ్యాపారి శనివారం రజిత ఇంటికి వచ్చి నిలదీశాడు. తన డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావంటూ నిలదీశాడు. భార్య అప్పు చేసిందని తెలిసి ముత్యాలు ఆశ్చర్యపోగా.. వడ్డీ వ్యాపారి గొడవతో చుట్టుపక్కల వాళ్ల ముందు తలెత్తుకోలేనని మనస్తాపానికి గురయ్యాడు. ఆవేదనతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి ముత్యాలును కిందకు దించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ముత్యాలు చనిపోయినట్లు ఆదివారం వైద్యులు ప్రకటించారు.


More Telugu News