డిజిటల్ అరెస్టులపై సజ్జనార్ ట్వీట్
- సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి అవగాహనా లోపమే కారణమని వెల్లడి
- నేరం ఏదైనా సరే డిజిటల్ గా అరెస్ట్ చేయరన్న మాజీ పోలీస్ బాస్
- వ్యక్తిగత వివరాలను పోలీసులు ఫోన్ ద్వారా అడగరని వివరణ
సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి అవగాహనా లోపమే ప్రధాన కారణమని ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ చెప్పారు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ కేసులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ట్వీట్ చేశారు. ‘‘నేరం ఏదైనా సరే 'డిజిటల్ అరెస్ట్' అనేదే ఉండదు. దర్యాప్తు అధికారులు నేరుగా వచ్చి నేరస్తులను అరెస్ట్ చేస్తారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే అది మోసం అని గుర్తించండి. సైబర్ మోసాల్లో చిక్కుకోవడానికి కారణం అవగాహనా లోపమే. మన దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ ద్వారా అడగదు. లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఫోన్ లేదా ఆన్ లైన్ ద్వారా బెదిరింపులకు పాల్పడవు. ఎవరైనా బెదిరిస్తే వారు నకిలీలని అర్థం. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ కాల్ వస్తే భయపడకుండా మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేసి సమాచారం అందించండి’’ అంటూ సజ్జనార్ ప్రజలకు సూచించారు.