సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ

  • ప్రతిష్ఠాత్మక ఎంసీజీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్
  • విరాట్ కోహ్లీ పుంజుకునేనా?
  • మరో 134 పరుగులు సాధిస్తే ఎంసీజీలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్
  • 449 పరుగులతో అగ్రస్థానంలో నిలిచిన సచిన్ టెండూల్కర్ 
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి నాలుగవ టెస్ట్ మ్యాచ్‌ ఆరంభం కానుంది. సిరీస్‌లో అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో (ఎంసీజీ) జరగనుంది. సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో ఉండడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి. ఈ మేరకు సన్నాహాల్లో మునిగిపోయాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శనపై ప్రత్యేక ఫోకస్ ఉంటుంది. వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో ఎలా ఆడతాడనేది చర్చనీయాంశంగా మారింది.

కాగా, మెల్‌బోర్న్ మైదానంలో సరికొత్త చరిత్రను సృష్టించేందుకు విరాట్ కోహ్లీ అడుగుదూరంలో నిలిచాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువయ్యాడు. ఎంసీజీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 449 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 316 పరుగులతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో టెస్టు మ్యాచ్‌లో మరో 134 పరుగులు సాధిస్తే సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ అధిగమిస్తాడు. 

ఎంసీజీలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు
1. సచిన్ టెండూల్కర్- 449
2. అజింక్యా రహానె - 369
3. విరాట్ కోహ్లీ- 316
4. వీరేంద్ర సెహ్వాగ్- 280
5. రాహుల్ ద్రావిడ్- 263.

వరుస వైఫల్యాలు
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా వరుసగా  విఫలమవుతున్నాడు. పెర్త్‌ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ 5 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో టెస్టులో 7, 11 పరుగులు, మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు మాత్రమే కొట్టాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 126 పరుగులు మాత్రమే సాధించాడు.


More Telugu News