కార్గిల్‌ యుద్ధం.. పాక్ సైనికుల చొరబాటును గుర్తించి సైన్యానికి సమాచారమిచ్చిన పశువుల కాపరిమృతి

  • 1999 కార్గిల్‌లోకి చొరబడిన పాక్ సైనికులు
  • తప్పిపోయిన బర్రెను వెతుకుతుండగా శత్రువులను గుర్తించిన తాషి
  • వెంటనే భారత సైన్యానికి సమాచారం
  • ఆ వెంటనే స్పందించిన సైన్యం
  • పాక్ పన్నాగాన్ని తిప్పికొట్టిన భారత్
  • ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్‌కు హాజరైన తాషి
  • ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సైన్యం
తాషి నామ్‌గ్యాల్.. ఈ పేరు వినగానే కార్గిల్ యుద్ధం గుర్తొస్తుంది. ఒక గొప్ప దేశభక్తుడు కళ్ల ముందు కదలాడతాడు. 1999 కార్గిల్ యుద్ధానికి ముందు పాక్ సైనికులు ఆర్యన్ వ్యాలీ గుండా కార్గిల్ సెక్టార్‌లోకి చొరబడుతున్న విషయాన్ని గుర్తించిన ఈ పశువుల కాపరి భారత సైన్యానికి సమాచారం అందించాడు. ఫలితంగా అప్రమత్తమైన భారత బలగాలు పాక్ కుట్రను భగ్నం చేసి తోకముడిచేలా చేశాయి.

శత్రువుల కార్గిల్ చొరబాటుపై భారత సైన్యానికి సమాచారం అందించిన ఈ పశువుల కాపరి తాజాగా మృతి చెందాడు. ఆయన వయసు 58 సంవత్సరాలు. లడక్‌లోని ఆర్యన్ వ్యాలీలోని గార్ఖోన్‌లో ఆయన అకస్మాత్తుగా మృతి చెందాడు. అయితే, ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు.

కనిపించకుండా పోయిన తన బర్రెలు (యాక్)ను వెతుకుతున్న సమయంలో పాక్ సైనికులు పఠానుల వస్త్రధారణలో బటాలిక్ పర్వత రేంజ్‌లో బంకర్లు తవ్వుతుండడం చూసి కీడు శంకించాడు. వెంటనే ఆ విషయాన్ని భారత సైన్యానికి చేరవేయడం ద్వారా కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. 1999 మే 3 నుంచి జులై 26 వరకు జరిగిన ఈ యుద్ధంలో భారత సైన్యం ముందు నిలవలేక పాక్ సైన్యం తోక ముడిచింది.

ఈ ఏడాది మొదట్లో ద్రాస్‌లో నిర్వహించిన ‘కార్గిల్ విజయ్ దివస్’ తాషి.. ఉపాధ్యాయురాలైన తన కుమార్తెతో కలిసి హాజరయ్యాడు. ఆయన మృతికి ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ‘ఓ దేశభక్తుడిని కోల్పోయాం.. లడక్ ధైర్యానికి ఆత్మశాంతి కలగాలి. 1999 ఆపరేషన్ విజయ్‌ సమయంలో ఆయన అందించిన సహకారం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ అని ‘ఎక్స్’లో పోస్టు చేసింది.


More Telugu News