పొర‌పాటు చేసి సారీ చెప్పిన ర‌ష్మిక.. అస‌లేం జ‌రిగిందంటే..!

  • తాను థియేట‌ర్‌లో చూసిన మొద‌టి సినిమా 'గిల్లీ' అన్న ర‌ష్మిక‌
  • ఈ మూవీ 'పోకిరి' సినిమాకు రీమేక్ అని పొర‌బ‌డ్డ న‌టి
  • 'గిల్లీ' చిత్రం 'ఒక్క‌డు'కి రీమేక్ కావ‌డంతో ఆమె ఇంట‌ర్వ్యూ వీడియో వైర‌ల్‌
  • దాంతో త‌న పొర‌పాటు తెలుసుకుని 'ఎక్స్' వేదిక‌గా సారీ చెప్పిన ర‌ష్మిక‌
నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ చేసిన పొర‌పాటును తెలుసుకుని తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా సారీ చెప్పారు. తాను థియేట‌ర్‌లో చూసిన మొద‌టి సినిమా త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన 'గిల్లీ' అని తెలిపారు. అందుకే విజ‌య్ ద‌ళ‌ప‌తి అంటే త‌న‌కు అమిత‌మైన ఇష్ట‌మ‌ని ఆమె ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. 

ఈ సంద‌ర్భంలో 'గిల్లీ' మూవీ తెలుగు 'పోకిరి' సినిమాకు రీమేక్ అని ర‌ష్మిక పొర‌బ‌డ్డారు. కానీ, ఆ మూవీ 'ఒక్క‌డు'కి రీమేక్ కావ‌డంతో స‌ర‌దాగా ఆట‌ ప‌ట్టిస్తూ ఆమె ఇంట‌ర్వ్యూ వీడియోను నెటిజ‌న్లు వైర‌ల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా ర‌ష్మిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. అందులోనూ తెలుగులో ఫన్నీగా రాసి పోస్ట్ చేశారు. 

"అవును.. ఇంట‌ర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది.. సారీ. గిల్లీ సినిమా ఒక్క‌డు రీమేక్ అని. పోకిరి మూవీని అదే పేరుతో త‌మిళంలో  రీమేక్ చేశారు. అప్ప‌టికే సోష‌ల్ మీడియాలో నాపై పోస్టులు వైర‌ల్ అయ్యాయి. సారీ.. సారీ.. మైబ్యాడ్. కానీ, నాకు వాళ్లు న‌టించిన అన్ని సినిమాలు ఇష్ట‌మే" అని ఆమె రాసుకొచ్చారు.  

ఇక ర‌ష్మిక ఇటీవ‌ల విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన 'పుష్ప‌- 2'తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె ఈ మూవీ విజ‌యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా రూ. 1500 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. అందులోనూ బాలీవుడ్‌లో 'పుష్ప‌- 2'కి అడ్డులేకుండా పోయింది. వ‌సూళ్ల ప‌రంగా అక్క‌డ ఎన్నో రికార్డుల‌ను బ్రేక్ చేస్తోంది. కాగా, ర‌ష్మిక ప్ర‌స్తుతం 'ఛావా', 'సికింద‌ర్‌', 'ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌', 'కుబేరా' ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. 


More Telugu News