చ‌రిత్ర సృష్టించిన పాకిస్థాన్‌.. 21వ శతాబ్దంలో తొలి జ‌ట్టుగా రికార్డు!

  • 21వ శతాబ్దంలో సఫారీ గడ్డపై వరుసగా మూడు వన్డే సిరీస్‌లను గెలుచుకున్న తొలి జట్టుగా రికార్డు
  • 2013, 2021లోనూ సిరీస్‌లను కైవసం చేసుకున్న పాక్‌
  • 7 పర్యటనల్లో పాకిస్థాన్ మూడు సార్లు వన్డే సిరీస్ గెల‌వ‌డం విశేషం
అంతర్జాతీయ వన్డేల్లో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు చరిత్ర సృష్టించింది. 21వ శతాబ్దంలో ద‌క్షిణాఫ్రికా గడ్డపై వరుసగా మూడు వన్డే సిరీస్‌లను గెలుచుకున్న తొలి జట్టుగా రికార్డుకెక్కింది. ద‌క్షిణాఫ్రికాతో గురువారం జరిగిన రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది.

సఫారీ గడ్డపై పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో వన్డే సిరీస్ విజయం. ఆ జట్టు 2013, 2021లో సిరీస్‌లను కైవసం చేసుకుంది. అలాగే ఏడు పర్యటనల్లో పాకిస్థాన్ మూడు సార్లు వన్డే సిరీస్ గెల‌వ‌డం విశేషం. పాకిస్థాన్ తర్వాత ఆస్ట్రేలియా 10 పర్యటనల్లో మూడు సార్లు ద‌క్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.

ఈ సిరీస్ విజయంపై పాక్ సార‌థి మహమ్మద్ రిజ్వాన్ హ‌ర్షం వ్యక్తం చేశాడు. "జట్టులోని ప్రతీ ఒక్కరు రాణించారు. శుభారంభం దక్కకున్నా మాకు మంచి భాగస్వామ్యం లభించింది. నేను, బాబర్ ఆజామ్ నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాం. 300 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ కమ్రాన్ గులామ్ సూపర్ ఇన్నింగ్స్ కార‌ణంగా 320 ర‌న్స్‌ చేశాం. బౌలర్లు అద్భుతంగా రాణించారు" అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. మహమ్మద్ రిజ్వాన్(80), బాబర్ ఆజామ్(73), కమ్రాన్ గులామ్(63) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ద‌క్షిణాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకే ప‌రిమిత‌మైంది. హెన్రీచ్ క్లాసెన్(97) త్రుటిలో సెంచ‌రీ చేజార్చుకున్నాడు. మిగ‌తా స‌ఫారీ బ్యాటర్లు చెతులెత్తేయ‌డంతో ఆతిథ్య జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది 4, నసీమ్ షా 3 వికెట్ల‌తో ద‌క్షిణాఫ్రికా ప‌త‌నాన్ని శాసించారు. 




More Telugu News