ఒకే ఒక్క రోజు 8.30 లక్షల మంది మృత్యువాత.. చరిత్రలో ఆ రోజున ఏం జరిగిందంటే..!

  • జనవరి 23, 1556న చైనాను కుదిపేసిన తీవ్ర భూకంపం
  • షాంగ్సీ, షంగ్సీ ప్రావిన్సులలో ప్రళయం సృష్టించిన ప్రకృతి విపత్తు
  • అదృశ్యమైపోయిన ఇళ్లు, నిర్మాణాలు
  • కొండలుగా మారిపోయిన మైదాన ప్రాంతాలు
  • భూమిపై భారీగా పగుళ్లు.. వరదల ప్రవాహం
ఒకే ఒక్క రోజు.. ఒకే ప్రకృతి విపత్తు ప్రభావంతో ఏకంగా 8.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఉన్న ప్రపంచ జనాభాలో కేవలం 5 శాతం మాత్రమే ఉన్న రోజుల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా భావిస్తున్న ఈ ఘటన జనవరి 23, 1556న చైనాలో జరిగింది. షాంగ్సీ, షంగ్సీ ప్రావిన్సులలో అతి తీవ్రమైన భూకంపం ప్రళయ విలయాన్ని సృష్టించింది.

భూకంప తీవ్రత 8గా ఉండొచ్చని అంచనా వేసిన ఈ విపత్తు ధాటికి ఆ ప్రాంతాల్లోని ఇళ్లు, నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. అనేక ఇళ్లు అదృశ్యమయ్యాయి. చాలా నగరాలు ధ్వంసమయ్యాయి. తక్షణ ప్రాణనష్టం కాకుండా అనేక మంది దీర్ఘకాలిక ప్రభావాలకు గురయ్యారు. కరవు, వ్యాధులు, జనాభా వలసలు వంటి మార్పులు చోటుచేసుకున్నాయి.

చరిత్రలో అత్యధిక మంది చనిపోయిన రోజుగా జనవరి 23, 1556 చరిత్రలో మిగిలిపోయింది. అత్యధిక మరణాలు షాంగ్సీ ప్రావిన్స్‌లో సంభవించాయి. చైనా చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ఈ భూకంపాన్ని ‘జియాజింగ్ భూకంపం’ అని కూడా పిలుస్తారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం పేర్కొంది. మింగ్ రాజవంశం కాలంలో జియాజింగ్ చక్రవర్తి పాలనలో ఈ విపత్తు సంభవించిందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న షాంగ్సీ, షంగ్సీ, హెనాన్, గన్సు ప్రావిన్సులలో ఏకకాలంలో భయంకరమైన ఈ భూకంపం సంభవించిందని, దక్షిణ తీరం వరకు ఈ ప్రభావం నమోదైందని పేర్కొంది.

భూకంపం సంభవించిన మూడేళ్ల తర్వాత ఒక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. భూమిపై పగుళ్లు ఏవిధంగా ఏర్పడ్డాయి, ఆ పగుళ్ల నుంచి నీళ్లు ఏ విధంగా ప్రవహించాయనేది ఫలకంపై వివరించారు. ఎన్నో ఇళ్లు భూమిలో కలిసిపోయి అదృశ్యమయ్యాయి. మైదాన ప్రాంతాలు అకస్మాత్తుగా కొండలుగా మారిపోయాయని విషాద తీవ్రతను అభివర్ణించారు.

మొత్తంగా భూకంపం తీవ్రతను బట్టి చూస్తే ప్రకృతి ప్రళయం సృష్టిస్తే వినాశనం ఏ స్థాయిలో ఉంటుందో నాటి విషాదం ఒక హెచ్చరికగా నిలిచింది. నేటి జనాభా పరిమాణంతో పోల్చితే షాంగ్సీ భూకంప మృతుల సంఖ్య చాలా ఎక్కువని చెప్పాలి. 


More Telugu News