కాకినాడ పోర్ట్, సెజ్‌ కేసు.. విజయసాయిరెడ్డికి మరోమారు నోటీసులు!

  • కేఎస్‌పీఎల్, కేసెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నట్టు కేసు 
  • ఏపీ సీఐడీ కేసు ఆధారంగా రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
  • ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్టు గుర్తింపు 
  • విజయసాయి సహా ఇప్పటికే పలువురికి నోటీసులు
  • వివిధ కారణాలతో విచారణకు డుమ్మా కొడుతుండడంతో మరోమారు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం
 కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ (కేఎస్‌పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో మనీలాండరింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ.. వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితోపాటు ఇతర నిందితులకు మరోమారు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇది వరకు జారీచేసిన నోటీసులకు వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

కేఎస్‌పీఎల్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేయగా, దీని ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ప్రాథమిక విచారణ అనంతరం మనీలాండరింగ్ జరిగినట్టు గుర్తించింది. దీంతో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు అభియోగాలు నమోదు చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసి నిందితులైన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, ‘అరబిందో’ యజమాని పెనక శరత్‌చంద్రారెడ్డి, విజయసాయి నామినీ సంస్థగా చెబుతున్న పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్‌పీ ప్రతినిధులకు ఇటీవల నోటీసులు జారీ చేసిన ఈడీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

అయితే, పలు కారణాలు చెబుతూ నిందితులు విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొడుతుండటంతో తాజాగా మరోమారు నోటీసులిచ్చేందుకు సిద్ధమైంది. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులైన అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్  (అరో అరబిందో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్) డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకూ ఈడీ రెడీ అవుతోంది. మరోవైపు విచారణకు హాజరు కావాలంటూ శరత్‌చంద్రారెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది.


More Telugu News