జెత్వానీ కేసులో ఆయనను ఇంకా అరెస్ట్ చేయలేదేం?.. సీఐడీని ప్రశ్నించిన హైకోర్ట్

  • ఏ2గా ఉన్న సీతారామాంజనేయులు అందుబాటులో ఉన్నారా? పారిపోయారా? అన్న హైకోర్ట్ 
  • నిందితులను వరుసగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఏజీ వాదనలు
  • అవసరమనుకుంటే అదుపులోకి తీసుకుంటారని వివరణ
  • పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లపై ముగిసిన విచారణ
  • జనవరి 7న నిర్ణయాన్ని ప్రకటిస్తానని ప్రకటించిన జడ్జి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఏపీ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు అందుబాటులో ఉన్నారా? లేక పారిపోయారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆయనను ఇంకా ఎందుకు అదుపులోకి తీసుకోలేదని సీఐడీ అధికారులను అడిగింది. ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై వివరాలు సమర్పించాలని హైకోర్ట్ ఆదేశించింది. ఆయన ఇప్పటివరకు ముందస్తు బెయిలు పిటిషన్‌ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం సందేహం వ్యక్తం చేసింది. అందుబాటులో ఉండాలంటూ సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లోనే ఆయనకు ప్రభుత్వం చెప్పి ఉంటుంది కదా? అని ఈ సందర్భంగా కోర్టు గుర్తుచేసింది. 

అవసరం అనుకుంటే అరెస్ట్
నిందితులను వరుస క్రమంలో అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని, నిజాలను రాబట్టేందుకు అవసరం అనుకుంటే అరెస్ట్‌ చేస్తారని హైకోర్ట్ అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానం ఇచ్చారు. ఒక కేసులో అరెస్ట్ వ్యవహారం అన్నది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ విచక్షణాధికారమని అన్నారు. జెత్వానీపై కేసు నమోదు, అరెస్ట్‌ వెనుక కుట్ర కోణాన్ని బయటపెట్టేందుకు నిందితులను కస్టోడియల్‌ విచారణ చేయాల్సిన అవసరం ఉందని, పిటిషనర్లకు ముందస్తు బెయిలు ఇవ్వొద్దని, పిటిషన్లను కొట్టివేయాలని ఏజీ కోరారు. ముందస్తు బెయిలు ఇస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని సందేహాలు వ్యక్తం చేశారు. జెత్వానీ కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై గురువారం వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని జనవరి 7న వెల్లడిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ తెలిపారు.

మానవత్వం లేకుండా ప్రవర్తించారు
కాదంబరి జెత్వానీ విషయంలో ఐపీఎస్‌ అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరించారని ఆమె తరపున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ముంబైలో ఓ పారిశ్రామికవేత్తపై జెత్వానీ పెట్టిన అత్యాచారం కేసులో పోలీసులకు సాక్ష్యాధారాలు అందించకుండా అడ్డుకునేందుకు ఇక్కడి పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి ఆమెను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. వేధింపుల వెనుక నాటి రాష్ట్రప్రభుత్వం, గత సీఎంవో కార్యాలయం, ఐపీఎస్‌ అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారని, నాటి నిఘా విభాగాధిపతిగా ఉన్న సీతారామాంజనేయులు ఇప్పటివరకు కనీసం బెయిలు పిటిషన్‌ కూడా దాఖలు చేయలేదని పేర్కొన్నారు. 

చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తే నేరం ఎలా అవుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. ఇప్పటికే సాక్ష్యాధారాలను సేకరించారని, కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ అవసరం లేదని అన్నారు. ఒక కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించే అధికారం డీజీపీకి లేదని వాదనలు వినిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారి గున్నీ ముంబై వెళ్లారని పేర్కొన్నారు.


More Telugu News