బీజేపీ ఎంపీలు నన్ను నెట్టేశారు... నాకు గాయమైంది: లోక్ సభ స్పీకర్ కు ఖర్గే లేఖ

  • అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు
  • పార్లమెంటు ప్రాంగణంలో తోపులాట
  • తన మోకాళ్లకు గాయమైందన్న ఖర్గే
  • విచారణ జరిపించాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ
అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విపక్షాలను ఆగ్రహావేశాలకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో, నేడు పార్లమెంటు ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఎన్డీయే, ఇండియా కూటమి పక్షాల ఎంపీల మధ్య తోపులాట జరగ్గా... బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేశ్ రాజ్ పుత్ గాయపడ్డారు. 

వీరిలో ప్రతాప్ చంద్ర సారంగికి తలకు లోతైన గాయం కావడంతో వైద్యులు కుట్లు వేశారు. ఈ ఇద్దరు ఎంపీలకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందించారు. 

ఈ క్రమంలో, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మకర్ ద్వార్ ఎంట్రన్స్ దగ్గర జరిగిన ఘర్షణ సందర్భంగా బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని,దాంతో తాను అదుపుతప్పి కిందపడిపోయానని వెల్లడించారు. 

తన మోకాళ్లకు గాయమైందని ఆ లేఖలో పేర్కొన్నారు. తన మోకాళ్లకు అప్పటికే శస్త్రచికిత్స జరిగిందని, ఇప్పుడు కిందపడడంతో గాయం ప్రభావం మోకాళ్లపై ఎక్కువగా పడిందని ఖర్గే వివరించారు. వెంటనే కాంగ్రెస్ ఎంపీలు ఓ కుర్చీ తీసుకురావడంతో దానిపై కూర్చున్నానని తెలిపారు. అక్కడ్నించి తాను కుంటుతూనే సభకు వెళ్లానని పేర్కొన్నారు. 

ఈ తోపులాట ఘటనపై విచారణ జరిపించాలని తన లేఖలో డిమాండ్ చేశారు. రాజ్యసభ విపక్ష నేతపై ఇలాంటి దాడి జరగడం గర్హనీయమని వివరించారు.


More Telugu News