చెన్నై చేరుకున్న అశ్విన్.. ఇంటి ద‌గ్గ‌ర‌ ఘ‌న స్వాగ‌తం.. ఇదిగో వీడియో!

  • రిటైర్మెంట్ తర్వాత తొలిసారి చెన్నైకి అశ్విన్
  • చెన్నై విమానాశ్ర‌యంలో అత‌నికి అభిమానుల ఘ‌న స్వాగ‌తం
  • అక్క‌డి నుంచి ఇంటికి వచ్చిన అశ్విన్ కు కుటుంబ సభ్యుల గ్రాండ్ వెల్‌క‌మ్‌
  • అశ్విన్ రాకతో కాలనీ మొత్తం సందడిగా మారిన వైనం
అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆస్ట్రేలియా నుంచి గురువారం ఉద‌యం స్వ‌దేశానికి చేరుకున్నాడు. చెన్నై విమానాశ్ర‌యంలో దిగిన అత‌నికి అక్క‌డ అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డి నుంచి ఇంటికి వచ్చిన అశ్విన్ కు కుటుంబ సభ్యులు గ్రాండ్ వెల్‌క‌మ్‌ చెప్పారు. వీడ్కోలు ప్రకటన తర్వాత ఆస్ట్రేలియా నుంచి బుధవారం బయల్దేరిన అశ్విన్ గురువారం ఉదయానికి చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నాడు. 

బ్యాండ్ మేళం చప్పుళ్లు, కోలాహాలంతో కుటుంబ స‌భ్యులు, కాలనీ వాసులు, అభిమానులు దిగ్గ‌జ‌ క్రికెటర్‌కు పూలు చల్లుతూ ఘ‌న‌ స్వాగతం పలికారు. అశ్విన్ రాకతో కాలనీ మొత్తం సందడిగా మారింది. ఇక ఇంటి గేటు వద్దకు చేరుకోగానే కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగానికి గుర‌య్యారు. 

ఇంటి వద్ద అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. "నేను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాను. వీలైనంత ఎక్కువ కాలం చెన్నై తరఫున ఆడాలని అనుకుంటున్నాను. ఓ క్రికెటర్‌గా అశ్విన్ అలసిపోలేదు. కానీ, భారత క్రికెటర్‌గా ఆ నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది అంతే" అని అన్నాడు. 

ఇక రిటైర్మెంట్ ప్రకటించడం కష్టంగా అనిపించిందా? అన్న ప్రశ్నకు అశ్విన్‌ బదులిస్తూ... "వీడ్కోలు నిర్ణయం అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఓ భావోద్వేగ సందర్భం. కానీ, నాకు ఇది సంతృప్తినిచ్చింది. ఎప్పట్నుంచో నాలో కూడా ఈ ఆలోచన ఉంది. గబ్బా టెస్టు సమయంలో నాలుగో రోజు... ఇక నిర్ణయం తీసుకోవాలి అనిపించింది, ఐదో రోజు ప్రకటించా"అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.


More Telugu News