తల్లి హత్య కేసు.. భారత‌ సంతతి వ్యక్తికి యూకేలో జీవిత ఖైదు!

  • తల్లి భజన్ కౌర్ పై దాడి చేసి చంపేసిన కొడుకు సిందీప్ సింగ్‌
  • తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో ఘ‌ట‌న
  • 16 రోజుల విచారణ త‌ర్వాత‌ సింగే హత్యకు పాల్పడినట్లు తేల్చిన లీసెస్టర్ క్రౌన్ కోర్టు
తల్లి హత్య కేసులో దోషిగా తేలిన‌ 48 ఏళ్ల భారత‌ సంతతి వ్యక్తికి బ్రిట‌న్ కోర్టు తాజాగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వారు నివాసం ఉంటున్న ఇంట్లోనే 76 ఏళ్ల తల్లిపై దాడి చేసి స‌ద‌రు వ్యక్తి హత్యకు పాల్పడినట్లు కోర్టు విచార‌ణ‌లో తేలింది.

వివ‌రాల్లోకి వెళితే.. మే 13న అనుమానాస్ప‌దంగా చ‌నిపోయిన‌ భజన్ కౌర్ తల, ముఖంపై తీవ్ర‌ గాయాలు కావ‌డం లీసెస్టర్‌షైర్ పోలీసులు గుర్తించారు. దాంతో ఆమె కుమారుడు సిందీప్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అత‌డిని లీసెస్టర్ క్రౌన్ కోర్టులో హాజ‌రుప‌రిచారు. 16 రోజుల విచారణ అనంతరం సింగ్ హత్యకు పాల్పడినట్లు కోర్టు తేల్చింది. దాంతో తాజాగా అత‌నికి జీవిత ఖైదు విధించింది. 

ఈస్ట్ మిడ్‌ల్యాండ్స్ స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి చెందిన డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ మార్క్ సింస్కీ మాట్లాడుతూ.. "ఇది తీవ్ర కలత కలిగించే కేసు. తన తల్లి కౌర్ ని చంపిన తర్వాత సింగ్ ఆమె మృతదేహాన్ని త‌న ఇంటి తోట‌లో పూడ్చిపెట్టేందుకు ప్ర‌య‌త్నించాడు. దానికోసం బయటకు వెళ్లి ప‌లుగు, ఒక గోనె సంచి కొన్నాడు. కానీ అతను ఆ ప‌ని చేయ‌లేక‌పోయాడు. ఆ త‌ర్వాత ఇంటి నుంచి వాసన రావ‌డంతో కంగారు ప‌డ్డాడు. 

ఈ క్ర‌మంలో భ‌జ‌న్ కౌర్ గురించి బంధువులు వాకబు చేసిన స‌మ‌యంలోనూ అత‌డు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చాడు. అలాగే అధికారుల‌ను కూడా త‌ప్పుదోవ ప‌ట్టించాడు. కానీ, ఇంటి నుంచి వాస‌న రావ‌డంతో బంధువులు అనుమానంతో పోలీసుల‌కు చేసిన‌ ఫిర్యాదు మేర‌కు విచార‌ణ మొద‌లైంది. ఈ క్ర‌మంలో ఇంట్లోనే ఆమె మృత‌దేహాన్ని గుర్తించ‌డం జ‌రిగింది. మొద‌ట త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని సింగ్ బుకాయించాడు. కానీ, ఆ త‌ర్వాత తానే త‌ల్లిని క‌డ‌తేర్చిన‌ట్లు అంగీక‌రించాడు" అని డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 


More Telugu News